Modi-Amit Shah: ఇది కదా వ్యూహం.. సీఎంల ఎంపికలో ‘మోదీ-షా’ మార్క్‌!

మూడు రాష్ట్రాల్లో కొత్త వారికి భాజపా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం వెనుక సార్వత్రిక ఎన్నికల వ్యూహం దాగుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Updated : 12 Dec 2023 18:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన భాజపా (BJP).. ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా.. సీఎంలు ఎవరన్నదానిపై ఓ స్పష్టత రాకపోవడం పార్టీ నేతలు, కార్యకర్తలను సందిగ్ధంలో పడేసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రిని అధిష్ఠానం ప్రకటిస్తుంటే విస్తుపోవడం ప్రతిపక్షాల వంతయ్యింది. ఇందులో మోదీ-షా (Modi Amit Shah) తమ మార్కు ఏంటో చూపించారు. అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా (General Elections) భాజపా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సీఎంల ఎంపిక వెనుక కారణాలను ఓసారి విశ్లేషిస్తే..

  •  మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లో బీసీల ప్రభావం ఎక్కువ. వీరందరి దృష్టిని ఆకర్షించేందుకు, బీసీలకు భాజపా సమున్నత స్థానం కల్పిస్తోందన్న సందేశం ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా మధ్యప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్‌ యాదవ్‌కు సీఎం పదవిని అప్పగించింది.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేశ్‌యాదవ్‌, బిహార్‌లో లాలు ప్రసాద్‌యాదవ్‌లు యాదవ వర్గానికి చెందినవారు.  ఈ రెండు రాష్ట్రాలపై వీరి ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌కు మోహన్‌యాదవ్‌ ఎంపికతో ఆ రెండు రాష్ట్రాల్లో అఖిలేశ్‌, లాలు పార్టీలకు భాజపా సవాల్‌ విసిరింది.
  •  ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు ఎక్కువ. వీరందరికీ భాజపా మద్దతుగా నిలుస్తుందని చెప్పేలా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్‌ సాయ్‌ని అధిష్ఠానం నియమించింది.గతంలో ఝార్ఖండ్‌లో భాజపా అధికారంలోఉన్న సమయంలో రఘుబర్‌దాస్‌ సీఎంగా వ్యవహరించారు. ఝార్ఖండ్‌ ఆదివాసీ రాష్ట్రం కాబట్టి ఆ వర్గానికి చెందిన వారినే నియమించాలని విపక్షాలు ఆందోళన చేశాయి. వీరికి సమాధానంగా ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్‌ సాయ్‌కి అధికార పగ్గాలందించారు.
  •  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ భాజపా అధిష్ఠానం సామాజిక వర్గాన్ని కీలకంగా తీసుకుంది. రాజస్థాన్‌తోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో జాట్‌లు, రాజ్‌పుత్‌ల ప్రభావం ఎక్కువ. బ్రాహ్మణులు కూడా కీలకంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన ఆదిత్యనాథ్‌ సీఎంగా ఉండటంతో.. రాజస్థాన్‌లో సీనియర్‌ నాయకులను, కేంద్ర మంత్రులను కాదని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్‌ శర్మకు సీఎం పదవి అప్పజెప్పింది.
  •  భాజపా విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి సీనియర్‌ నేతలు ఉన్నారు. రాజస్థాన్‌లో వసుంధర రాజే, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ లాంటి హేమాహేమీలను కాదని కొత్తవారికి అవకాశం ఇచ్చింది. తద్వారా కొత్త నాయకత్వానికి భాజపా ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందనే సందేశాన్ని పంపింది.
  • ఎన్నికల ప్రచారంలో భాజపా స్థానిక సమస్యలను ప్రస్తావించినప్పటికీ, మోదీ పాలన, దేశాభివృద్ధినే ఆయుధాలుగా మార్చింది. ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు సరికదా.. అంతర్గతంగానూ దానిపై అసలు చర్చే నడవకుండా జాగ్రత్త పడింది. ఫలితంగా వర్గ విభేదాలు తలెత్తకుండా చూసుకుంది.
  •  కొత్త వ్యక్తులకు సీఎం పదవులు అప్పగించడం వెనుక మరో రహస్యం దాగుంది. పార్టీ సీనియర్‌ నేతల్లో ఎవరికైనా పగ్గాలు అప్పగిస్తే.. అవతలివారు చిన్నబుచ్చుకొని, పార్టీలో చీలికలు ఏర్పడే అవకాశాలున్నాయి. అలాంటి సమస్యలు తలెత్తకుండా కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తూ.. వారికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీనియర్లను కోరింది.
  •  సామాజిక, రాజకీయ పరమైన కోణాలతోపాటు సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలను కూడా భాజపా పరిగణనలోకి తీసుకుంది. కొత్త ముఖ్యమంత్రులుగా ఎంపికైన ఈ ముగ్గురూ ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నవారే. తద్వారా సంఘ్‌పరివార్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నామన్న సంకేతాన్ని భాజపా పంపినట్లయింది.

 భాజపాను గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న తరుణంలో.. వారి అంచనాలకు దొరకకుండా.. అన్ని వర్గాల వారికి సమప్రాధాన్యత ఇస్తూ వారిని ఆకట్టుకోవాలని, తద్వారా ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేయాలని మోదీ-షా పన్నిన వ్యూహం  సార్వత్రిక ఎన్నికల్లో ఎంత మేర పని చేస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని