Jignesh Mevani: పీఎంవో కుట్రలో భాగంగానే నా అరెస్టు : జిగ్నేశ్‌ మేవాణీ

వచ్చే ఎన్నికల్లో తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అస్సాం ప్రభుత్వం, పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాణీ మండిపడ్డారు.

Updated : 02 May 2022 19:04 IST

ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ గుజరాత్‌ ఎమ్మెల్యే

దిల్లీ: వచ్చే ఎన్నికల్లో తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అస్సాం ప్రభుత్వం, పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాణీ మండిపడ్డారు. ప్రణాళిక ప్రకారమే తనను అరెస్టు చేశారన్న ఆయన.. ఈ కుట్రకు ప్రధానమంత్రి కార్యాలయమే రూపకల్పన చేసిందని ఆరోపించారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన జిగ్నేశ్‌, ప్రధాని మోదీపైనా ఆరోపణలు గుప్పించారు.

‘ఓ మహిళను అడ్డం పెట్టుకొని తనపై తప్పుడు కేసు బనాయించారు. ఇది 56 అంగుళాల వ్యక్తి (మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ) జరిపిన పిరికిపంద చర్య. కుట్రలో భాగంగానే అస్సాం పోలీసులు నన్ను అరెస్టు చేశారు. ఈ కుట్రను ప్రధాని కార్యాలయమే రూపొందించింది. గుజరాత్‌లో మరికొన్ని నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను నాశనం చేసేందుకే ఈ ప్రయత్నం’ అని ఆయన ఆరోపించారు. ఇక 22 పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంతోపాటు ఇటీవల ముంద్రాపోర్టులో సీజ్‌ చేసిన వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని జిగ్నేశ్‌ మేవాణీ డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా జూన్‌ 1న బంద్‌ పాటిస్తామన్నారు.

ఇదిలాఉంటే, నేరపూరిత కుట్ర, వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం, శాంతికి భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి అభియోగాలపై జిగ్నేశ్‌ మేవాణీపై అస్సాంలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి జిగ్నేశ్‌ మేవాణీని అస్సాం పోలీసులు గుజరాత్‌లో అరెస్టు చేసి తీసుకెళ్లారు.  ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని