Opposition Meet: విపక్ష భేటీకి ఆకస్మిక అతిథి.. పర్వాలేదన్న రాహుల్‌

Opposition Meet: వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఢీ కొట్టేందుకు విపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దానిలో భాగంగా ఆ పార్టీల నేతలు శుక్రవారం ముంబయిలో భేటీ అయ్యారు.

Updated : 01 Sep 2023 19:52 IST

ముంబయి: ప్రతిపక్షాల కూటమి ఇండియా( opposition bloc INDIA) సభ్యుల మధ్య శుక్రవారం ముంబయిలో సమావేశం జరుగుతోంది. 28 పార్టీలకు చెందిన దాదాపు 63 మంది ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. కొద్దినెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నిక(Lok Sabha elections)ల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేను ఢీకొట్టే లక్ష్యంతో ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ భేటీ అనంతరం 11 మందితో కూడిన సమన్వయ కమిటీ, లోగోను ప్రకటించే అవకాశముందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లోగో విడుదల ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. పలు పార్టీలు సూచించిన మార్పులు అమలు చేసి, కొత్త లోగోను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.  (Opposition Meet)

సమావేశం ప్రారంభం కాగానే చంద్రయాన్‌-3 విజయంపై భారత అంతరిక్ష సంస్థ ఇస్రో(ISRO)ను అభినందిస్తూ విపక్ష కూటమి ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ‘ఆదిత్య ఎల్‌-1’కు ఆల్‌ ది బెస్ట్ చెప్పింది. ప్రస్తుత ఈ భేటీ ముంబయిలో గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో జరుగుతోంది. 

ఏమిటీ ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’?

రెండురోజుల భేటీలో భాగంగా నిన్ననే ముంబయి చేరుకున్న నేతలకు ముంబయిలో శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే విందు ఇచ్చారు. ఈ క్రమంలో నేతల మధ్య ముందస్తు ఎన్నికల అంశం ప్రస్తావనకొచ్చింది. ఎన్డీయే ఆకస్మిక వ్యూహాలను తిప్పికొట్టేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా ఉండాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ నేతలను అప్రమత్తం చేశారు. 

కూటమి గ్రూప్‌లో ప్రత్యేక అతిథి..

గతేడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ కపిల్ సిబల్(Kapil Sibal) ఆ సమావేశంలోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ నుంచి విముఖత వ్యక్తమైనట్లు సమాచారం. ఈ సమావేశానికి సిబల్ అధికారిక ఆహ్వానితులు కాదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాత్రం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. కూటమి నేతలతో కలిసి సిబల్ గ్రూప్‌ ఫొటో దిగినట్లు  కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన కపిల్‌ సిబల్‌.. అంతర్గత సమస్యలను ప్రస్తావిస్తూ గత ఏడాది పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

భేటీకి ముందు కంటి ఆసుపత్రికి వెళ్లిన రాహుల్..

భేటీ ప్రారంభం కావడానికి ముందు ఈరోజు ఉదయం రాహుల్(Rahul Gandhi) కంటి ఆసుపత్రికి వెళ్లారు. చెకప్ చేయించుకొని భేటీ జరుగుతోన్న గ్రాండ్ హయత్ హోటల్‌కు తిరిగివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు