Pawan Kalyan: వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా - జనసేన ప్రభుత్వమే: పవన్‌ కల్యాణ్‌

వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమి ఖాయమని.. రాబోయేది తమ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated : 01 Oct 2023 21:30 IST

అవనిగడ్డ: వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమి ఖాయమని.. రాబోయేది తమ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. నాలుగో విడత వారాహి యాత్రను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ పాలనపై ధ్వజమెత్తారు.

‘‘వైకాపా ప్రభుత్వాన్ని దించడమే మా లక్ష్యం. వైకాపా ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఎక్కడ? జగన్‌ అద్భుతమైన పాలకుడైతే నాకు రోడ్డుపైకి వచ్చే అవసరమే లేదు. డబ్బు, భూమి మీద నాకు ఎప్పుడూ కోరిక లేదు. నా నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకున్నా. ఈ పదేళ్లలో మా పార్టీ అనేక దెబ్బలు తింది. ఆశయాలు, విలువల కోసం మేం పార్టీ నడుపుతున్నాం. యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వమని చెప్పా. మనకు పార్టీల కంటే ఈ రాష్ట్రం చాలా ముఖ్యం. రాష్ట్ర యువత.. ఎంతో విలువైన దశాబ్ద కాలం కోల్పోయారు. కానిస్టేబుల్‌ అభ్యర్థుల నియామక ప్రక్రియలోనూ అనేక ఇబ్బందులు ఉన్నాయి.

కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం

జగన్‌ రూ.వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైంది. అధికార మదం ఉన్న వైకాపా నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. మెగా డీఎస్‌సీ కోరుకుంటున్న అందరికీ మేం అండగా ఉంటాం. 30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. 2018 నుంచి డీఎస్‌సీ ప్రకటన రాలేదు. డీఎస్‌సీ కోచింగ్‌కు అవనిగడ్డ ప్రధాన కేంద్రం. డీఎస్‌సీ వేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు కానీ, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. పోలీసు ఉద్యోగి కష్టనష్టాలు నాకు బాగా తెలుసు. మేం వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటాం. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్‌ అంటున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు. సరైన వ్యక్తులను గెలిపించుకోకుంటే ఒక తరం నష్టపోతుంది. జగన్‌ ఓటమి ఖాయం.. తెదేపా - జనసేన అధికారంలోకి రావడం ఖాయం. ముఖ్యమంత్రి పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తా. నాకు సీఎం సీటు కంటే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యం’’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

అవనిగడ్డలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ..

అవనిగడ్డ నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. ‘‘జగన్‌ ముద్దూమురిపాలతో పదేళ్లు జనంలో తిరిగారు. జగన్‌ను దేవుడని మొక్కితే.. ఆయన దయ్యమై ప్రజలను పీడిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 86 ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న వైకాపా మహమ్మారికి.. జనసేన-తెదేపా వ్యాక్సినే మందు. మనల్ని కులాలుగా వేరు చేస్తున్నారు.. కులం కంటే మానవత్వం గొప్పది. నేనెప్పుడూ ఎవరిలో కులం చూడలేదు.. గుణమే చూశా. ప్రతి ఒక్కరిలో గుణం, ప్రతిభ, సామర్థ్యం మాత్రమే చూస్తా. ఏపీ అభివృద్ధిని వైకాపా ఫ్యాన్‌కు ఉరి వేసేశారు. సైకిల్, గ్లాస్‌ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. వైకాపా ఫ్యాన్‌కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. జగన్‌ పరిస్థితి.. ఓడిపోయే ముందు హిట్లర్‌ పరిస్థితిలా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు 175 కాదు.. 15 సీట్లు వస్తే చాలా గొప్ప’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని