pawan Kalyan: పోరాటం ఎలా చేయాలో ఉత్తరాంధ్ర నేర్పింది: పవన్‌ కల్యాణ్

వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని  ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. వారాహి మూడో విడత యాత్రలో భాగంగా ఆదివారం గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు.

Updated : 13 Aug 2023 21:00 IST

గాజువాక: వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. వారాహి మూడో విడత యాత్రలో భాగంగా ఆదివారం గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ఇక్కడి ప్రజాదరణ చూస్తుంటే గాజువాకలో తాను ఓడిపోయినట్టు భావించడం లేదన్నారు. పోరాటం ఎలా చేయాలో ఉత్తరాంధ్ర నేర్పించిందన్నారు.

‘‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఎంతో మంది బలిదానాలతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం 26వేల ఎకరాలు ఇచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌కు భూమి ఇచ్చిన వారిలో ఇంకా సగం మందికి పరిహారం రాలేదు. ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారు రోడ్డున పడ్డారు. ప్రజల కోసం నిలబడలేని వాళ్లు రాజకీయాల్లోకి రావొద్దు. 2018లో ఇక్కడి వైకాపా ఎంపీపై రౌడీషీట్‌ ఉంది. ఇలాంటి వారిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే  స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడగలరా? కేసులున్న వాడికి ధైర్యం రాదు. వైకాపా నేతలకు పార్లమెంట్‌లో ప్లకార్డు ప్రదర్శించే దమ్ముందా? నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడేవారికే ధైర్యం ఉంటుంది. ఉత్తరాంధ్ర, విశాఖ కోసం దిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటా. ఆంధ్రా ఎంపీలంటే దిల్లీలో చులకన భావన ఉంది. దోపిడీ చేసి ఎంపీలు అయ్యారని కేంద్ర పెద్దలకు తెలుసు. జనసేన తరఫున ఎంపీ లేకపోయినా.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయొద్దని అమిత్‌ షాకు చెప్పా. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను పరిశ్రమగా చూడొద్దు.. భావోద్వేగాలతో కూడుకున్నదని వివరించా’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ప్రజల మద్దతు లేకపోతే నేనేం చేయలేను..

‘‘స్టీల్‌ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రాన్ని కోరా. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్క ఎంపీ కూడా విశాఖ స్టీల్‌కు సొంత గనులు కేటాయించాలని అడగలేదు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని దిల్లీ పెద్దలకు చెప్పా. ఏ పదవీ లేని నేనే ప్రధాని, హోం మంత్రి వద్దకు వెళ్తున్నా. స్వార్థం లేకుండా ఉంటే ప్రధాని, హోం మంత్రి అన్నీ వింటారు.  వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. ప్రజల మద్దతు లేకుంటే నేనేం చేయలేను. గంగవరం పోర్టు వద్ద పోలీసు కాల్పుల్లో మత్స్యకారుడు చనిపోయారు. కానీ, పోర్టు నిర్వాసితులకు ఇంకా న్యాయం చేయలేదు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించరా? ఆస్తులు అమ్ముకునేందుకా ప్రజలు మిమ్మల్ని సీఎంగా ఎన్నుకున్నది. జగన్‌ను..మరో 6 నెలలు ప్రజలు భరించాలి. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తా’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

రుషికొండపై దేవుడు ఉండాలి.. నేరగాళ్లు కాదు

‘‘సిరిపురం జంక్షన్‌లో నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకుని 24 అంతస్తులతో భవనాలు నిర్మిస్తున్నారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారు. ఆ భూములకు సంబంధించి ఇప్పటికే కోర్టుల్లో కేసులు ఉన్నాయి. జనసేన అధికారంలోకి రాగానే అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం. గాజువాక ప్రజల సాక్షిగా చెబుతున్నా పొరపాటున ఎవరైనా విశాఖ ఎంపీ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే నష్టపోతారు జాగ్రత్త. విశాఖ ప్రజలను దోచుకునేందుకా ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ అయింది. రుషికొండలో వాల్టా చట్టానికి తూట్లు పొడిచారు. రుషి కొండపై దేవుడు ఉండాలి కానీ, నేరగాళ్లు కాదు. ప్రజలు మేల్కొన్నారు.. జగన్‌ గద్దె దిగక తప్పదు. జగన్‌ను దేవుడు అనుకుని మొక్కాం.. దయ్యమై జనాన్ని పట్టుకున్నారు. జగన్‌ను.. అదృష్టం అందలం ఎక్కించింది.. బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్‌ను మరోసారి సీఎంగా భరించలేం. ఏ ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు.. జగన్‌ ప్రభుత్వం మాత్రం రాకూడదు’’ అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని