Sachin Pilot: ప్రజా విశ్వాసమే నాకు పెద్ద ఆస్తి.. ఆ డిమాండ్లపై తగ్గేదే లే!

‘‘ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని నిలుపుకోవడమే నా తొలి ప్రాధాన్యం. గత 20-22 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజల విశ్వాసాన్ని తగ్గే పని ఏదీ చేయలేదన్నారు రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌. 

Published : 11 Jun 2023 23:59 IST

దౌసా: ప్రజల విశ్వాసమే తనకు పెద్ద ఆస్తి అని.. వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతానని కాంగ్రెస్‌  నేత సచిన్‌ పైలట్‌(Sachin Pilot) అన్నారు. తన సొంత పార్టీకి చెందిన సీఎం అశోక్‌ గహ్లోత్‌ సర్కార్‌ ముందు ఉంచిన తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన తండ్రి రాజేశ్ పైలట్‌ వర్థంతి సందర్భంగా ఆదివారం గుర్జార్‌ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ..   ‘ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని నిలుపుకోవడమే నా తొలి ప్రాధాన్యం. ప్రజల నమ్మకం, వారికి ఇచ్చిన వాగ్దానాలు, విశ్వాసమే రాజకీయాల్లో పెద్ద ఆస్తులు. గత 20-22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించే పని ఏదీ నేను చేయలేదు.  రాబోయే కాలంలోనూ మీ నమ్మకమే నాకు పెద్ద ఆస్తి. దాన్ని తగ్గించుకొనే పని ఎప్పటికీ చేయనని హామీ ఇస్తున్నా.  ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల కోసం పోరాడుతూ వారికి న్యాయం చేసేలా కృషిచేస్తా’’ అన్నారు. 

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ (Rajasthan)లో అంతర్గత విభేదాలు అధిష్ఠానానికి తలనొప్పి వ్యవహారంగా మారిన విషయం తెలిసిందే. సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్ల మధ్య రాజీ కుదిర్చేందుకు కాంగ్రెస్‌ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. సీఎంపై ఎప్పటికప్పుడు  విమర్శలు చేస్తూ సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తూ వచ్చిన సచిన్‌ పైలట్‌ ఇటీవల పలు ప్రజా సమస్యలపై సొంత ప్రభుత్వానికే అల్టిమేటం జారీ చేశారు. గతంలో భాజపా ఆధ్వర్యంలోని వసుంధర రాజె ప్రభుత్వంలో అవినీతిపై చర్యలు తీసుకోవడంతో పాటు రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను రద్దు చేసి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని,  ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంతో నష్టపోయిన వారికి తగిన పరిహారం అందజేయాలంటూ ప్రభుత్వం ముందు ఆయన డిమాండ్లు పెట్టారు. నిర్ణీత గడువులోగా నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తానని కూడా హెచ్చరించారు.  ఈ క్రమంలోనే ఆయన తండ్రి రాజేశ్ పైలట్‌ వర్థంతి రోజు (జూన్‌ 11న) సచిన్‌ పైలట్‌ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం అవన్నీ వదంతులేనంటూ పలుమార్లు కొట్టిపారేసింది. రాజస్థాన్‌ ఎన్నికల్లో సమిష్టిగా కలిసి పనిచేస్తామని చెప్పింది. 

ఈ నేపథ్యంలో తన తండ్రి వర్థంతి సభలో మాట్లాడిన సచిన్‌ పైలట్‌.. యువత మెరుగైన భవిష్యత్తు కోసమే తాను గళం వినిపిస్తున్నానని చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ మద్దతుగానే ఉంటానన్నారు. ప్రజల మద్దతు తనకు ఎప్పుడూ ఉందన్నారు. తన వాయిస్‌ బలహీనమైందేమీ కాదన్న ఆయన.. తాను వెనకడుగు వేయనని స్పష్టంచేశారు. రాజకీయాల్లో నిజాయతీని దేశం కోరుకుంటోందని.. యువత జీవితాలతో ఆటలాడుతున్నవారెంటో తనకు ఇష్టం ఉండదన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలే తన విధానమని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని