Rahul-PK: రాహుల్‌గాంధీతో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ!

రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు.

Published : 13 Jul 2021 21:34 IST

పంజాబ్‌ రాజకీయంపై మంతనాలు..?

దిల్లీ: వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లిన ప్రశాంత్‌ కిశోర్‌.. సుమారు గంటపాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. ముఖ్యంగా పంజాబ్‌ ఎన్నికలపైనే వీరు చర్చించినట్లు సమాచారం. తాజా సమావేశంలో ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, నవజ్యోత్‌సింగ్‌ సిద్దూల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోన్న నేపథ్యంలో పీకే-రాహుల్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముసలం మొదలయ్యింది. ముఖ్యంగా అమరీందర్‌ సింగ్‌, నవజ్యోత్‌సింగ్‌ల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. దీంతో ఎన్నికల ముందు నెలకొన్న ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో గతవారమే ప్రశాంత్‌ కిశోర్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని అమరీందర్‌ సింగ్‌ కలిసిన మరుసటి రోజే ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ అయ్యారు. కొన్నిరోజుల క్రితమే ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తోనూ పీకే మంతనాలు జరిపారు. దీంతో ప్రశాంత్‌ టీం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని ప్రశాంత్‌ కిశోర్‌ బృందం చెబుతోంది.

ఇదిలాఉంటే, ఎన్నికల వ్యూహ రచనలతో దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ (PK) ఇక నుంచి వ్యూహకర్తగా కొనసాగబోనని రెండు నెలల క్రితం ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున పనిచేసిన పీకే టీం.. వారి వ్యూహాలతో మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ సాధించడంలో సఫలమయ్యింది. అయినప్పటికీ తాను వ్యక్తిగతంగా వ్యూహకర్తగా కొనసాగనని.. తన టీం మాత్రం కొనసాగుతుందని చెప్పారు. తాజాగా పంజాబ్‌తో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్‌ కీలక నేతలతో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని