BJP: ఏపీ, తెలంగాణకు భాజపా కొత్త అధ్యక్షులు వీరే

తెలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను భాజపా అధిష్ఠానం ఖరారు చేసింది. తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు పురందేశ్వరిని నియమించినట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.

Updated : 04 Jul 2023 16:16 IST

దిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా(BJP) తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది. ఏపీలో సోము వీర్రాజు, తెలంగాణలో బండి సంజయ్‌లను పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన భాజపా అధిష్ఠానం..  ఆ స్థానంలో పురందేశ్వరి(D Purandeshwari), జి.కిషన్‌ రెడ్డి(G Kishan Reddy)లను నియమించింది. ఏపీ భాజపా చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణ భాజపా చీఫ్‌గా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని నియమిస్తూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. 

అలాగే, తెలంగాణలో భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు.  వీరితో పాటు ఝార్ఖండ్‌ భాజపా చీఫ్‌గా మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీ; పంజాబ్‌ భాజపా నూతన అధ్యక్షుడిగా సునీల్ జాఖఢ్‌ను నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. 

పురందేశ్వరి ఇలా...

దగ్గుబాటి పురందేశ్వరి 1959 ఏప్రిల్‌ 22న జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురందేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి.. 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లో పురందేశ్వరి భాజపాలో చేరారు. భాజపాలో మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం భాజపాకు ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పురందేశ్వరికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. 

కిషన్‌ రెడ్డికి రెండోసారి...

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలోనూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి, 2014-16 మధ్య తెలంగాణకు భాజపా అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. 2016-18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన  తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని