Rahul Gandhi:యువతకు 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ₹3వేలు నిరుద్యోగ భృతి: రాహుల్‌ హామీ

Karnataka assembly polls: కర్ణాటకలో యువతకు రాహుల్‌ గాంధీ(Rahul gandhi) కీలక హామీలు ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే నిరుద్యోగ భృతితో పాటు భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు హామీ ఇచ్చారు.

Published : 20 Mar 2023 20:32 IST

బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka assembly elections) సమీపిస్తుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మాండ్యలో ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రారంభించి ప్రసంగించగా.. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) బెళగావిలో నిర్వహించిన ‘యువక్రాంతి సమావేశం‘లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు కీలక హామీలు ప్రకటించారు.  త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్‌లకు రెండేళ్ల పాటు నెలకు రూ.3వేలు, డిప్లొమా వారికి రూ.1500ల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర కాలంలో 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు మొత్తంగా 10లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని.. రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించాలన్నారు.

బొమ్మైది ‘40శాతం కమీషను సర్కార్‌..’

అలాగే, ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బసవరాజ్‌ బొమ్మై సారథ్యంలోని భాజపా సర్కార్‌పై రాహుల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయమైన సర్కార్‌ అనీ.. ఏదైనా పని జరగాలంటే 40శాతం కమీషను ఇవ్వాల్సిందేనంటూ విరుచుకుపడ్డారు. అధికార భాజపాకు మిత్రులైన కొంతమందికే అన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయని.. ఇదే చివరకు అవినీతికి దారితీస్తోందన్నారు. ఈ దేశం ప్రతి ఒక్కరిదీ అని.. అదానీలాంటి ఎంపిక చేసిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులదేం కాదన్నారు.ఈ సభలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా తదితర నేతలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు