Rajya Sabha polls: రాజ్యసభ ఎన్నికలు.. కేంద్రమంత్రి జైశంకర్‌ నామినేషన్‌

ఈ నెల 24న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రమంత్రి ఎస్‌.జైశంకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే, బెంగాల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ప్రకటించింది.

Published : 10 Jul 2023 15:09 IST

గాంధీనగర్‌:  రాజ్యసభ(Rajya Sabha) నుంచి జులై, ఆగస్టు నెలల్లో రిటైరవుతున్న 10 మంది స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు జులై 24న ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. రాజ్యసభ ఎన్నికలు(Rajya Sabha Polls) వేళ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌(S.Jaishankar) గుజరాత్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. గాంధీనగర్‌లోని అసెంబ్లీ కాంప్లెక్స్‌లో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణి రీటా మెహతాకు సమర్పించారు .ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీఎం భూపేంద్ర పటేల్‌, భాజపా గుజరాత్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ తదితరులు ఉన్నారు. జులై 24న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ నెల 13తో ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 17వరకు గడువు విధించారు. జైశంకర్‌ 2019లో తొలిసారి గుజరాత్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. పదవీ కాలం ఆగస్టుతో ముగియనుండటంతో తాజాగా భాజపా నుంచి మరోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. 

‘‘గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాతృభూమికి సేవ చేసే అవకాశం కల్పించిన గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మళ్లీ రాజ్యసభకు నామినేషను సమర్పించాను’’ అంటూ జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. 

గుజరాత్‌కు సంబంధించి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా.. వీరిలో ఎనిమిది మంది భాజపా నుంచి; మిగతా సభ్యులు కాంగ్రెస్‌ తరఫున ఉన్నారు. భాజపా నుంచి ఎనిమిది మంది సభ్యుల్లో ఎస్‌.జైశంకర్‌, జుగాలి ఠాకూర్‌, దినేశ్ అనవాడియా పదవీ కాలం ఆగస్టు 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ఈ మూడు స్థానాల్లో తాము అభ్యర్థులెవరినీ బరిలోకి దించడంలేదని కాంగ్రెస్‌ శుక్రవారమే స్పష్టంచేసింది. 182మంది సభ్యులు కలిగిన గుజరాత్‌ అసెంబ్లీలో తమకు తగినంతమంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదని పేర్కొంది. గతేడాది జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టపోయి కేవలం 17 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. 

అభ్యర్థుల్ని ఖరారు చేసిన టీఎంసీ

ఇదిలా ఉండగా.. రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఖరారు చేసింది. డెరిక్‌ ఓబ్రియెన్‌, డోలా సేన్‌, సుఖేందు శేఖర్‌ రాయ్‌, సామ్రుల్‌ ఇస్లామ్‌, ప్రకాశ్‌ చిక్‌ బారాయిక్‌, సాకేత్‌ గోఖలేలను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ నెల 24న పశ్చిమబెంగాల్‌లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని