Pilot Vs Gehlot: దీక్షకు దిగుతానని సచిన్‌ హెచ్చరిక.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కలవరం!

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మరోసారి కలవరం నెలకొంది. గతంలో వసుంధర రాజే పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో గహ్లోత్‌ ప్రభుత్వం విఫలమైందని సచిన్‌ పైలట్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఒకరోజు నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు.

Published : 09 Apr 2023 14:32 IST

జైపుర్: రాజస్థాన్‌ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot), మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)ల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. గతంలో వసుంధర రాజే (Vasundhara Raje) నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంలో జరిగిన అవినీతి (Corruption)పై చర్యలు తీసుకోవడంలో సీఎం గహ్లోత్‌ సర్కారు విఫలమైందని సచిన్‌ పైలట్‌ తాజాగా ఆరోపించారు. ఈ క్రమంలోనే అవినీతిని వ్యతిరేకిస్తూ మంగళవారం ఒక రోజు నిరహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ (Congress) పార్టీ కట్టుబడి ఉందనే భరోసా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో రాజే హయాంలోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వసుంధర రాజే పాలన వైఫల్యాలు, అవినీతిపై గహ్లోత్‌ ఆరోపణలు చేస్తున్నట్లు కనిపిస్తోన్న వీడియోలను సచిన్‌ పైలట్‌ ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఎక్సైజ్ మాఫియా, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు, లలిత్ మోదీ కేసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో విచారణను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. భాజపా పాలనలోని అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని, అయినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ హామీలను నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్లలేమని పైలట్‌ పేర్కొన్నారు.

‘అవినీతి విషయంలో పార్టీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకుని ఉండాల్సింది. త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి కదా!’ అని పైలట్‌ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌ వ్యవహారాలపై పార్టీ అధిష్ఠానానికి అనేక సూచనలు చేశానని, అవినీతిపై చర్యలు తీసుకోవడం అనేది వాటిలో ఒకటని చెప్పారు. ‘ఇది మన ప్రభుత్వం. మనం చర్యలు తీసుకోవాలి. దీంతో ప్రజల విశ్వాసం కొనసాగుతుంది’ అని అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల వేళ.. సొంత పార్టీలోనే మరోసారి ధిక్కార స్వరం వినిపించడం కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిణామంగా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని