Amit Shah: ఇటాలియన్‌ కళ్లద్దాలు తీసి అభివృద్ధిని చూడండి.. రాహుల్‌ గాంధీపై అమిత్‌ షా విమర్శలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం విమర్శలు గుప్పించారు. రాహుల్‌ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి.. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలని ఎద్దేవా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని..

Published : 23 May 2022 01:31 IST

ఇటానగర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం విమర్శలు గుప్పించారు. రాహుల్‌ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి.. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలని ఎద్దేవా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని నమ్సాయి జిల్లాలో రూ.వెయ్యి కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే.. వారు కళ్లు మూసుకుని, మెలకువగా ఉన్నారు. రాహుల్‌ గాంధీ.. తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి ప్రధాని మోదీ, స్థానిక సీఎం పెమా ఖండూ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలి’ అని వ్యాఖ్యానించారు.

‘అరుణాచల్‌లో గత ఎనిమిదేళ్లలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు, శాంతి భద్రతల బలోపేతానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ, సీఎం పెమా ఖండూ చేసిన పనులు.. గత 50 ఏళ్లలో జరగలేదు’ అని అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్‌ షా.. ఈరోజు తెల్లవారుజామున ఇక్కడి గోల్డెన్ పగోడాను సందర్శించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సీఎం పెమా ఖండూ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి నేడు రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు, అభివృద్ధిని సమీక్షించనున్నారు. ఆర్మీ, ఇండో-టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌, అస్సాం రైఫిల్స్‌ తదితర సాయుధ బలగాల సిబ్బందితో భేటీ కానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని