Sarath Kumar: శరత్‌ కుమార్‌ కీలక నిర్ణయం.. భాజపాలో ఏఐఎస్‌ఎంకే విలీనం

తమిళ నటుడు శరత్‌కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీని భాజపాలో విలీనం చేసినట్లు ప్రకటించారు.

Published : 12 Mar 2024 16:55 IST

చెన్నై: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముంగిట తమిళనాట కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.  ప్రముఖ తమిళ సినీనటుడు ఆర్‌.శరత్‌ కుమార్‌ (Sarath kumar) తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK)ని భాజపాలో విలీనం చేశారు.  తన పార్టీ ఆఫీస్‌ బేరర్లతో పాటు తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ పార్టీలో విలీనం చేసిన విషయాన్ని ప్రకటించారు. చెన్నైలో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐక్యతతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ప్రధాని మోదీ (PM Modi) ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి భరోసాగా నిలుస్తున్నారని కొనియాడారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని తన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

1996లో డీఎంకేలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన శరత్‌కుమార్‌.. 2001లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఆ తర్వాత 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకేకు గుడ్‌బై చెప్పి తన సతీమణి రాధికతో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. కానీ కొద్ది నెలలకే అన్నాడీఎంకేను సైతం వీడారు. 2007 ఆగస్టులో ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని