Nara Lokesh: జగన్‌కు తెలిసే వివేకా హత్య!: నారా లోకేశ్‌

సీఎం జగన్‌కు తెలిసే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందనే విషయం సీబీఐ విచారణలో నిర్ధారణ అవుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. 

Published : 28 Feb 2022 14:31 IST

విశాఖ: సీఎం జగన్‌కు తెలిసే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగిందనే విషయం సీబీఐ విచారణలో నిర్ధారణ అవుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. హత్య చేయించిందెవరో వివేకా కుమార్తె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఉందని చెప్పారు. ఎంపీ అవినాష్‌రెడ్డి సూత్రధారి అని సాక్షులు వాంగ్మూలాల్లో చెప్పారని లోకేశ్‌ తెలిపారు. హత్య కేసులో సూత్రధారులు రోడ్లపై దర్జాగా తిరుగుతుంటే ప్రజల కోసం పోరాడుతున్న తెదేపా నాయకులపై జగన్‌ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. తనపై అసత్యాలు ప్రచురించారంటూ ‘సాక్షి’ దినపత్రికపై లోకేశ్‌ విశాఖ కోర్టులో రూ.75కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి విశాఖ కోర్టుకు ఆయన మరోసారి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

వివేకా హత్య కేసు నిందితులను జగన్‌ సర్కార్‌ వదిలేసిందని లోకేశ్‌ ఆరోపించారు. బాబాయిని చంపిన హంతకుల్ని పట్టుకోవాలనే తపన జగన్‌లో అసలు లేదని విమర్శించారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై అనవసర ఆరోపణలు చేశారని.. అధికారంలోకి వచ్చాక సీబీఐ దర్యాప్తు కూడా కోరలేదని గుర్తు చేశారు. మరోవైపు దొంగ రాతలు రాస్తామంటే కుదరదని లోకేశ్‌ అన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నారని..ఉన్నవాళ్లను ఇబ్బంది పెడుతుంటే కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయని లోకేశ్‌ ప్రశ్నించారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వాళ్లు రాజధాని నిర్మిస్తారా అని నిలదీశారు. విశాఖకు ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా అని ధ్వజమెత్తారు. సీబీఐ అధికారులపై కేసులు పెట్టడం ఇప్పుడే చూస్తున్నామని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని