Telangana News: అలాంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు?: నిరంజన్‌రెడ్డి

కేంద్రమంత్రుల అవగాహన రాహిత్యాన్ని తెలంగాణ ప్రజలు సహించరని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Updated : 26 Mar 2022 13:11 IST

తెలంగాణ ప్రజలు, మంత్రులను అవమానించారని ధ్వజం

హైదరాబాద్‌: కేంద్రమంత్రుల అవగాహన రాహిత్యాన్ని తెలంగాణ ప్రజలు సహించరని రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్పులు సూచిస్తే స్వీకరించే ఔదార్యం కూడా కేంద్ర మంత్రులకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ఇటీవల దిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సీఎం కేసీఆర్‌కు దిల్లీ పరిణామాల గురించి వివరించారు. సీఎంతో భేటీ వివరాలను ఇవాళ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డిలతో కలసి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.

ఆ సదుద్దేశం కేంద్రానికి లేదు..

‘‘వరి సాగు చేయండని.. రైతులను రెచ్చగొట్టిన రాష్ట్ర భాజపా నేతలు ఇప్పుడెందుకు కేంద్రాన్ని అడగట్లేదు. తెలంగాణలో యాసంగి వడ్లు మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయి. బాయిల్డ్‌ రైస్‌ కొనకపోతే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. ధాన్యం కొని కేంద్రమే మిల్లింగ్‌ చేసుకోవాలి. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కూడా కేంద్రం చేయట్లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో బియ్యం కొరతను తీర్చే సదుద్దేశం కూడా కేంద్రానికి లేదు. రైతుల సమస్యను పరిష్కరించేలేని కేంద్ర ప్రభుత్వం ఎందుకు? తెలంగాణ రైతుల కోసమైనా కిషన్‌రెడ్డి అడగవచ్చు కదా!

రాష్ట్ర మంత్రులను చూసే ధోరణి దుర్మార్గం

యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాలను పట్టించుకోవట్లేదని ఇదే భాజపా నేతలు అనలేదా? యూపీఏను విమర్శించిన భాజపా నేతలు ఇవాళ అదే ధోరణిలో వెళ్తున్నారు. రాష్ట్ర మంత్రులను పని వాళ్లుగా చూసే ధోరణి దుర్మార్గం. కేంద్రమంత్రి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మంత్రులను అవహేళన చేస్తూ మాట్లాడారు. తెలంగాణలో నూకలు తినే అలవాటును పెంచమంటూ ప్రజలను అవమానించారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని 20శాతానికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని విమర్శించారు. ఇథనాల్‌ తయారీకి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించట్లేదు. ఉగాది తర్వాత ఉద్ధృతమైన ఆందోళనలు చేస్తాం. సాగు చట్టాలను రద్దు చేసుకొని క్షమాపణలు కోరారు. తెలంగాణను క్షమాపణలు కోరే పరిస్థితిని తీసుకొస్తాం’’ అని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా వెళ్తామని గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పీయూష్‌ గోయల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలే కేంద్రానికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని