Chandrababu: అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించుకోలేం: చంద్రబాబు

ఐదుకోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ‘అమరావతి’ ప్రతీక అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంతం రైతులు చేపట్టిన..

Updated : 01 Nov 2021 13:56 IST

అమరావతి: ఐదుకోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ‘అమరావతి’ ప్రతీక అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్రని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం కన్నతల్లిలాంటి  భూముల్ని త్యాగం చేసి పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమంగా చంద్రబాబు దీన్ని అభివర్ణించారు.  అమరావతి ఉద్యమంపై పాలకపక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు, అవమానాలకు గురిచేసినా అనుకున్న ఆశయ సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మహా పాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలన్నారు. 

విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు. అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న తరుణంలో మూడు రాజధానుల పేరుతో రివర్స్‌ పాలనకు వైకాపా నేతలు తెరలేపారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ ప్రజల భవిష్యత్‌ కోసం ఆలోచించి ముందుచూపుతో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమని.. అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్రం అంధకారమవుతుందని చెప్పారు. పాదయాత్రకు ప్రజలు, వివిధ సంఘాలు, తెదేపా నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని