Chandrababu: జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలి: చంద్రబాబు

ఏపీ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని.. రాష్ట్రంలో జరిగిన పరిణాలను ప్రజలు అవగతం చేసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated : 04 Jan 2022 15:23 IST

అమరావతి: ఏపీ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని.. రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ప్రజలు అవగతం చేసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ విధ్వంసకుడని.. అబద్ధాల్లో ఆరితేరిన వ్యక్తి అని ధ్వజమెత్తారు. వైకాపా 32 నెలల విధ్వంసపాలనతో జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

భూములిచ్చిన పాపానికి ఇన్ని అవమానాలా?

విధ్వంసంతో పాలనను ప్రారంభించారని.. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చివేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ఆస్తి విధ్వంసంతోనే వైకాపా నేతల ఉన్మాదం బయటపడిందని మండిపడ్డారు. దానికి కొనసాగింపుగా అమరావతి విధ్వంసం మొదలుపెట్టారన్నారు. రాజధాని కోసం 50వేల ఎకరాల భూమిని రైతులు ఇచ్చారని.. వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారని చెప్పారు. భూములు ఇచ్చిన పాపానికి రైతులకు అవమానాలా? అని ఆయన నిలదీశారు. రూ.కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నపుడు ప్రజా చైతన్యం ఎంతో అవసరమని చెప్పారు. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2021లోనే పోలవరం పూర్తిచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడున్నారని.. దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇసుకపై 5 రెట్లు అదనంగా..

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఉచితంగా ఇచ్చే ఇసుకపై నాడు విమర్శలు చేసి.. నేడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ట్రక్కు ఇసుకపై 5రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్‌ పేరుతో దోపీడీకి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చారని.. అది ఏమైందని నిలదీశారు. మద్యంపై పెద్ద ఎత్తున దోపిడీ చేశారని ఆరోపించారు. మద్యం షాపుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లు లేవని.. లెక్కలు తెలిసిపోతాయనే వాటికి అవకాశం లేకుండా చేశారన్నారు.

కరోనాతో ప్రపంచం.. జగన్‌ పాలనతో రాష్ట్రం..

రాష్ట్ర విభజనకంటే జగన్ పాలనతో ఏపీ కోలుకోలేని విధంగా నష్టపోయిందని చంద్రబాబు అన్నారు. కరోనా వల్ల ప్రపంచం నష్టపోతే.. జగన్‌ పాలనతో రాష్ట్రం నష్టపోయిందన్నారు. 5కోట్ల మంది ప్రజల్ని ఆయన మోసం చేశారన్నారు. వంగవీటి రాధాపై రెక్కీ చేస్తే ఆధారాల్లేవన్నారని.. తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇస్తే ఏం చర్యలు తీసుకున్నారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. గౌతమ్ సవాంగ్ డీజీపీ పదవికి అనర్హుడన్నారు. పారదర్శక పాలన అంటూ జీవోలని దాచేస్తున్నారని.. తప్పు చేస్తున్నారు కాబట్టే జీవోలను దాచి పెడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తెదేపా హయాంలో ఎంతో శ్రమ, చొరవతో రాష్ట్రానికి కియా, హెచ్‌సీఎల్‌ సంస్థలను తీసుకొచ్చామన్నారు.  జాబ్‌ క్యాలెండర్‌.. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు లేవని.. యువత నిర్వీర్యం అయిపోయిందని చెప్పారు. రాజ్యాంగపరమైన వ్యవస్థలపైనా దాడులు చేస్తున్నారన్నారు. 

అప్పు ఎంత? ప్రజలకు ఇచ్చిందెంత?

జగన్‌ పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా తయారైందని చంద్రబాబు ఆరోపించారు. ఇష్టారీతిన అప్పులు చేశారని.. కాగ్‌ లెక్కలు అడిగితే చెప్పడం లేదన్నారు. ఏపీలో ప్రస్తుతం రూ.7లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. 2019 నాటికి రూ.3.14లక్షల కోట్లు ఉంటే అది ఇప్పుడు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు. 4వ తేదీ వచ్చినా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు. ఆదాయం లేకుండా అప్పులు చేసి.. దానికి ‘సంక్షేమం’ అని పేరు పెట్టారని ఆక్షేపించారు. వైకాపా వచ్చాక ఎంత అప్పు తెచ్చారు.. ఎంత మందికి ఇచ్చారనే లెక్కలు చెప్పాలని.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పుట్టబోయే పిల్లలు కూడా అప్పులతో పుట్టే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు కూడా భయపడుతున్నాయని చంద్రబాబు చెప్పారు.

ధైర్యముంటే నిత్యావసరాల ధరలు తగ్గించండి..

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని చంద్రబాబు అన్నారు. వరి సహా ఏ ఉత్పత్తులకూ గిట్టుబాటు ధర లేదని చెప్పారు. వరి వేయొద్దని రైతులకు చెప్పిన ప్రభుత్వం ఇది అని.. దేశానికి అన్నంపెట్టిన ఆంధ్రప్రదేశ్‌లోనే వరి వేయొద్దనే ధైర్యం వచ్చిందంటే ఏమని చెప్పాలో అర్థం కావట్లేదన్నారు. తిరిగి కోలుకోలేని ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని.. ప్రజలు సంక్రాంతి పండగ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని చంద్రబాబు విమర్శించారు. ధైర్యముంటే నిత్యావసరాల ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని