YS Sharmila: కేసీఆర్‌.. ప్రశ్నిస్తే ఎందుకంత అసహనం?: షర్మిల

ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా? అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు..

Published : 11 Aug 2021 13:17 IST

హైదరాబాద్‌: ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా? అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌ తన బాధ్యతను విస్మరిస్తే ఫీల్డ్‌ అసిస్టెంట్లు దాన్ని గుర్తు చేస్తూ సమ్మె చేస్తే వారి జీతాలు పెంచాల్సింది పోయి ఉద్యోగాల నుంచే తీసేస్తారా? అని ఆమె నిలదీశారు. ఇందిరాపార్కు వద్ద కాంట్రాక్ట్ ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్వహించిన ధర్నాలో షర్మిల పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘ప్రజల గురించి పట్టించుకోని కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. కేవలం ప్రశ్నించినందుకు 7,560 కుటుంబాలను రోడ్డున పడేశారు. ప్రశ్నించడం తెలంగాణ సిద్ధాంతం.. విధానం.. నినాదం. అది మర్చిపోయి ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్లను ఇబ్బందులు పెట్టారు. ఆర్టీసీ సంఘాలను కేసీఆర్‌ నిర్వీర్యం చేశారు. ప్రశ్నిస్తే ఎందుకంత అసహనం? మాట్లాడేవారికి వైఎస్సార్‌ మైక్‌ అందించి మరీ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇచ్చేవారు. కేసీఆర్‌ను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకే అవకాశం ఉండటం లేదు.. అలాంటిది ప్రజలకెక్కడిది? ప్రశ్నించే వారు లేరనుకున్నారా?మేం వచ్చాం. ప్రజల తరఫున అన్ని సమస్యలపైనా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పోరాడుతుంది’’ అని షర్మిల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని