Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్‌, ఎంఎన్‌పీ, జడ్‌పీఎమ్‌ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి?

Published : 26 Oct 2023 18:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఎన్నికల (Mizoram Elections) ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 40 స్థానాలైనా.. అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్‌ (Congress), మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), జోరం పీపుల్స్‌ మూమెంట్ (ZPM) పోటాపోటీగా అభ్యర్థుల్ని ప్రకటించి.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. వీటికి తోడు నేనూ బరిలో ఉన్నానంటూ భాజపా (BJP) కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ప్రధానంగా మూడు పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరించే అవకాశాలున్నాయ్‌? మణిపుర్ (Manipur) అల్లర్ల ప్రభావం మిజోరంపై ఉంటుందా? సంప్రదాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేనా?

రివాజు కొనసాగేనా?

మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని విజయాలకంటే మిజోరంలో గెలుపొందడమే ముఖ్యమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు ముఖ్యమంత్రి జొరాంథంగా నేతృత్వంలోని ఎంఎన్‌ఎఫ్‌ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.  కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎఫ్‌ల మధ్య అధికార పోరు ఇప్పటిది కాదు.. 1989 నుంచి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌కు చెందిన లాల్‌ థన్‌హవలా 1989లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1993, 2008, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందడంతో ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరోవైపు ఎంఎన్‌ఎఫ్‌కు చెందిన జొరాంథంగా 1998, 2003, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది.. మూడుసార్లు సీఎం పదవిని అధిరోహించారు. వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి రావడం మిజోరంలో రివాజుగా మారిన తరుణంలో తాజా ఎన్నికల్లోనూ తమ పార్టీయే విజయం సాధిస్తుందని జోరాంథంగా ధీమాగా ఉన్నారు.

క్రిస్టియన్ల ఓట్లు ఎవరికో..?

ఎన్డీయే, నార్త్‌ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలియన్స్‌ (ఎన్‌ఈడీయే) కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎంఎన్‌ఎఫ్‌కు క్రైస్తవ ఓట్లు చాలా కీలకం. రాష్ట్రంలో దాదాపు 87 శాతం మంది ఓటర్లు క్రిస్టియన్లే. వాళ్లను ఆకర్షించేందుకు జొరాంథంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ తమ రాష్ట్రానికి వస్తే ఆయనతో కలిసి తాను వేదిక పంచుకోబోనని చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల మణిపుర్‌లో చోటు చేసుకున్న అల్లర్లలో మైతేయిలు, కుకీలు పరస్పర దాడులకు దిగారు. ఈ దాడులను మిజోరంలోని క్రైస్తవులు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా మణిపుర్‌ అల్లర్లను పరిష్కరించడంలో భాజపా విఫలమైందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భాజపా విషయంలో సానుకూలంగా ఉంటే అది పార్టీకి నష్టంగా మారుతుందని ఎంఎన్‌ఎఫ్‌ భావిస్తోంది. అందుకే భాజపాకి వీలైంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా క్రిస్టియన్‌ ఓటర్లను ఆకర్షించవచ్చని భావిస్తోంది.

జొరాంథంగా వ్యూహం ఫలించేనా?

క్రిస్టియన్‌ ఓటర్లను ఆకర్షించేందుకు జోరాంథంగా ఓ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే జరిగిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనూ భాజపాపై ధిక్కార స్వరం వినిపించారు. కుకీలపై జరిగిన వింధ్వంస కాండను పార్లమెంట్‌ వేదికగా గట్టిగా వినిపించాలని ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ లార్లో సంగా, రాజ్యసభ ఎంపీ వన్లాల్‌వేనాకు నిర్దేశించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎంఎన్‌ఎఫ్‌ ఓటు వేసింది. అంతేకాకుండా భాజపా తీసుకొచ్చిన యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ) ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అటవీ సంరక్షణ (సవరణ)-2023 చట్టాన్ని కూడా వ్యతిరేకించింది. ఇవన్నీ మిజోరంలోని క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు ఉపకరిస్తాయని ఎంఎన్‌ఎఫ్‌ భావిస్తోంది. అయితే, ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 2018 ఎన్నికల్లో మొత్తం 40 నియోజకవర్గాలకుగానూ ఎంఎన్‌ఎఫ్‌ 26 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 5 సీట్లలో గెలుపొందగా.. మాజీ ఐపీఎస్‌ అధికారి లాల్‌దుహోమా నేతృత్వంలోని జడ్‌పీఎమ్‌ 8 చోట్ల విజయం సాధించింది. భాజపా కేవలం ఒక్క చోట మాత్రమే గెలుపొందింది.

కాంగ్రెస్‌ సంగతేంటి?

మిజోరంలో క్రైస్తవ ఓటర్లు ఎక్కువగా ఉండటం కాంగ్రెస్‌కు కాస్త కలిసొచ్చే అంశమే. కానీ, ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న థన్‌హవలా లేకుండా ఈసారి హస్తం పార్టీ బరిలోకి దిగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. 80 ఏళ్ల థన్‌హవలా రాజకీయాల నుంచి వైదొలగడంతో.. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మిజోరం పీసీసీ అధ్యక్షుడు లాల్‌స్వతను కాంగ్రెస్‌ నిలబెట్టింది. అయితే, మిజో ప్రజల సెంటిమెంట్‌ను ఈయన ఎంతమేర రగల్చగలడనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు, థన్‌హవలా మద్దతు కాంగ్రెస్‌కు ఉందని చెప్పేందుకు.. ఇటీవల మిజోరం రాజధాని ఐజ్వాల్‌ వెళ్లిన రాహుల్‌.. ఉన్నట్లుండి బైక్‌పై ఆయన ఇంటికి వెళ్లారు. థన్‌హవలాను పరామర్శించి, మిజోరంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు తీసుకున్నారు.

త్రిముఖ పోరు!

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి.. ఎంఎన్‌ఎఫ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన జడ్‌పీఎం ఈసారి గట్టీ పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 40 స్థానాలకు కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎఫ్‌, జడ్‌పీఎమ్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. భాజపా మాత్రం కేవలం 23 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. 2018 ఎన్నికల్లో బరిలో నిలిచిన 16 స్థానాల్లో అభ్యర్థులను భాజపా నిలబెట్టకపోవడం గమనార్హం. బయటకి వేర్వేరుగా కనిపిస్తున్నా భాజపా, ఎంఎన్‌ఎఫ్‌, జడ్‌పీఎఫ్‌ పార్టీలన్నీ ఒకటేనని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ప్రధాని మోదీకి మణిపుర్‌ అల్లర్లకంటే ఇజ్రాయెల్‌లో జరుగుతున్న విధ్వంసమే ఎక్కువైపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోసారి ఎంఎన్‌ఎఫ్‌కు అధికారం అప్పగిస్తే.. పరోక్షంగా భాజపాను గెలిపించినట్లే అవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.

క్రిస్టియన్లు అధిక సంఖ్యాకులుగా ఉన్న మిజోరంలో.. పొరుగు రాష్ట్రం మణిపుర్‌ పరిస్థితులు ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, వాటిని అధికార ఎంఎన్‌ఎఫ్‌ తనకు ఎంతమేర అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి. స్థానికంగా ఇటీవల పుంజుకుంటున్న జడ్‌పీఎం అధికారాన్ని చేజిక్కుంచుకోవడం కష్టమే అయినా.. కింగ్‌మేకర్‌ పాత్రను పోషించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఎంత వరకు ఫలించాయో తెలుసుకోవాలంటే డిసెంబర్‌ 3 వరకు వేచి చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని