మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలిపితే కేసీఆర్‌ అడ్డుకుంటున్నారెందుకు?: రేవంత్‌

మోదీ సర్కారు ఇష్టారీతిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతోందని.. కేసీఆర్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని 

Updated : 07 Apr 2022 15:17 IST

హైదరాబాద్‌: మోదీ సర్కారు ఇష్టారీతిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతోందని.. కేసీఆర్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌, మోదీ కలిసి ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై విద్యుత్‌ సౌధ వద్ద రేవంత్‌ రెడ్డి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్‌సౌధ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు కార్యాలయంలోకి వెళ్తుండగా రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడంలేదని ఆరోపణ చేస్తున్న కేసీఆర్‌.. రైతులకు మద్దతుగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపితే ఎందుకు అడ్డుకుంటున్నారు. మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే కేసీఆర్‌ మమ్మల్ని ఎందుకు గృహనిర్బంధాలు చేస్తున్నారు. మా కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్లలో పెడుతున్నారు. నిన్న రాత్రి పబ్‌ల ముందు నిరసన తెలిపితే యువజన కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి ఇప్పటి వరకు విడుదల చేయలేదు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కొట్లాడినా, గ్యాస్‌, ఇంధన ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నిరసన తెలిపినా అరెస్టులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా అడ్డుకుంటున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలొస్తున్నాయి. వడ్ల కొనుగోలుపై తెరాస- భాజపా కలిసి నాటకం ఆడుతున్నాయి’’ అని రేవంత్‌ అన్నారు.

అంతకముందు నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి కూడా విద్యుత్‌సౌధ ముట్టడికి బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి పలువురు నేతలతో కలిసి ఆయన ర్యాలీగా ముందుకు కదిలారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీనియర్‌ నేత మధుయాష్కీ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో భాగంగా కాంగ్రెస్‌ నేతలు విద్యుత్‌ సౌధ వద్ద బైఠాయించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మధుయాష్కీ, మల్లు రవి, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు విద్యుత్‌ సౌధ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారిలో 8 మందిని పోలీసులు విద్యుత్ సౌధలోకి అనుమతించారు. వీరంతా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు, ఇతర ఉన్నతాధికారులను కలిశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని