టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇవ్వకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిద్దాం: ఎంపీ కోమటిరెడ్డి

ఓట్ల కోసం పథకాల పేరుతో ప్రజలను మోసం చేసే సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగుల బాధ‌లు పట్టవా?అని కాంగ్రెస్‌ నేత, భువనగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (KomatiReddy VenkatReddy) ప్రశ్నించారు.

Updated : 23 Jul 2023 15:12 IST

హైదరాబాద్‌: ఓట్ల కోసం పథకాల పేరుతో ప్రజలను మోసం చేసే సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగుల బాధ‌లు పట్టవా?అని కాంగ్రెస్‌ నేత, భువనగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (KomatiReddy VenkatReddy) ప్రశ్నించారు. ఎంపీ కోమటిరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) అభ్యర్థులు (TRT Candidates) కలిశారు. ఏళ్లు గ‌డుస్తున్నా టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇవ్వడం లేద‌ని ఎంపీకి వివ‌రించారు.

ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్‌టీ కోసం నిరసన కార్యక్రమాలు చేద్దామని.. అయినా ప్రభుత్వం దిగిరాకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాన‌ని తెలిపారు. టీఆర్‌టీ కోసం అభ్యర్థులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. ప్రభుత్వ బ‌డుల్లో వేలాది టీచ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కానీ, ప్రభుత్వం మాత్రం వీటిని భ‌ర్తీ చేయ‌డం లేదని మండిపడ్డారు. టీఆర్‌టీ అంశాన్ని పీఏసీ స‌మావేశంలోనూ చ‌ర్చిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌టీ నోటిఫికేషన్‌ కోసం ఇందిరాపార్క్‌ వద్ద 48 గంట‌ల దీక్ష చేసి నిరుద్యోగుల‌కు అండ‌గా ఉంటామని వివరించారు. 

మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఉత్తర్వులు జారీ

4 నెలల్లో ఈ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వకుంటే.. వచ్చే కాంగ్రెస్‌ పాలనలో నెల రోజుల్లోనే నోటిఫికేషన్‌ వచ్చేలా చూస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. తాను హామీ ఇచ్చినట్లు నోటిఫికేష‌న్ ఇవ్వకపోతే.. తెలంగాణ కోసం చేసిన‌ట్టు నిరుద్యోగుల కోసం రాజీనామా చేస్తానని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని