Harish Rao: తెలంగాణకు ప్రత్యేకంగా ఏమిచ్చారో కిషన్‌రెడ్డి చెప్పాలి: హరీశ్‌రావు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. అమిత్‌ షా చెప్పిన అబద్ధాలనే కిషన్‌రెడ్డి రిపీట్‌ చేశారని విమర్శించారు.

Updated : 17 Jun 2023 21:45 IST

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిరంతర సహకారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పిన అబద్ధాలనే కిషన్‌రెడ్డి రిపీట్‌ చేశారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రూ.1.43లక్షల కోట్లు వెంటనే విడుదల చేయించాలని డిమాండ్‌ చేశారు. పన్నుల పంపిణీ అనేది రాష్ట్రాల రాజ్యాంగ హక్కు.. పన్నుల పంపిణీ భారతదేశం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో భాగంగా కాదని హరీశ్‌రావు తెలిపారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసు చేసిన కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41శాతం ఉన్నప్పటికీ, రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో దాదాపు 30శాతం మాత్రమే పొందుతున్నాయన్నారు.

జీఎస్టీ పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదు.. 

కేంద్రం.. పన్నుల భాగస్వామ్య పూల్‌లో భాగంకాని సెస్సులు, సర్‌ ఛార్జీలు విధిస్తోందన్నారు. పన్నుల పంపిణీలో తెంగాణ వాటా 2014-15లో 2.893శాతం ఉండగా 2021-22 నాటికి 2.102 శాతానికి తగ్గిందని వెల్లడించారు. కేంద్ర వాటాగా రూ.1588.08 కోట్లతో తెలంగాణ లో 100 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా నీటిని సరఫరా చేశామని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మిషన్ భగీరథ కింద రూ.36వేల కోట్లు వెచ్చించి 100 శాతం గృహాలకు నీటిసరఫరా చేసిందని హరీశ్‌రావు పేర్కోన్నారు. కేంద్రం ఇస్తున్న మొత్తం మిషన్ భగీరథ నిర్వహణకు కూడా సరిపోదన్నారు.తెలంగాణ నుంచి 2017-18, 2022-23 వరకు జీఎస్టీ పరిహారం సెస్‌గా రూ.34,737 కోట్లు వసూలు చేశారు.. కానీ తెలంగాణకు దక్కింది కేవలం రూ.8,927 కోట్లు మాత్రమేనని  వివరించారు. జీఎస్టీ  ప్రవేశపెట్టిన మొదటి రెండేళ్లలో పరిహారంగా వచ్చింది రూ.169 కోట్ల మాత్రమేనని హరీష్ రావు తెలిపారు. ఈ రెండేళ్లలో తెలంగాణ నుంచి వసూలైన జీఎస్టీ సెస్‌ రూ.10,285 కోట్లని వెల్లడించారు. పరిహారం మొత్తం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాలేదు కానీ, జీఎస్టీ పరిహార నిధి నుంచి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదని, అది తమ హక్కు అని తెలిపారు.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులేవి?

రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌94(2) ప్రకారం ఐదేళ్ల కాలానికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసింది రూ.2,250 కోట్లు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చట్ట ప్రకారం ఉన్న 2019-20, 2020-21, 2022-23 సంవత్సరాలకు ఎటువంటి మొత్తం విడుదల కాలేదన్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి  రాష్ట్రప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఈ మూడేళ్లకు గాను రూ.1350 కోట్లు ఎలాంటి కారణం లేకుండా నిలుపుదల చేశారని పేర్కొన్నారు. దీనిపై కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  జాతీయ రహదారులకు కేటాయింపులు రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ల నుంచి జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ ఉండదన్నారు.తెలంగాణకు కేటాయించిన నిధులు కిషన్‌రెడ్డి మెహర్బానీతో రాలేదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని