Kishan Reddy: ప్రశ్నించే గొంతులను ప్రగతిభవన్‌లో కూర్చొని అణచివేస్తారా?: కిషన్‌రెడ్డి

రెండు పడక గదుల ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు.

Updated : 20 Jul 2023 14:19 IST

హైదరాబాద్‌: రెండు పడక గదుల ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్‌లో కూర్చొని అణచివేస్తారా? అని దుయ్యబట్టారు. రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు శంషాబాద్‌ నుంచి బాటసింగారం బయలుదేరిన కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆపై అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ.. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. అనంతరం అక్కడ కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఆందోళన కాదని చెప్పినా..

‘‘తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. రెండు పడక గదుల ఇళ్లూ వారికి ఇవ్వడం లేదు. భారాసపై మా ఉద్యమం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. బాటసింగారంలో మధ్యలోనే వదిలేసిన ఇళ్లను చూద్దామని బయలుదేరాం. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద నన్ను అడ్డుకున్నారు. పలువురు నేతలనూ అరెస్ట్ చేశారు. ఇవాళ ధర్నా, ఆందోళన కాదని చెప్పినా.. పోలీసులు మా పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. బడుగు బలహీనవర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలుసుకోవడానికి వెళ్తే ఇలా వ్యవహరిస్తారా?

భారాసతో యుద్ధానికి మేం సిద్ధం

ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. నాతో అలా వ్యవహరించారు. పోలీస్ కమిషనర్, డీసీపీలు అమానుషంగా ప్రవర్తించారు. కల్వకుంట్ల కుటుంబ పాలనలో ప్రజలు తమ నీడను తామే చూసుకొని భయపడాల్సి వస్తోంది. ఇచ్చిన హామీల్లో సీఎం కేసీఆర్‌ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ప్రజల ఆవేదన, ఆక్రోశం.. భాజపా నేతల అరెస్టులతో తగ్గదు. ఈరోజు యుద్ధం మొదలైంది. కల్వకుంట్ల కుటుంబం, భారాసతో యుద్ధానికి మేం సిద్ధం. ప్రజల తరఫున ఈ యుద్ధం కొనసాగిస్తాం. మా రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. ఎన్నో సార్లు జైలుకు వెళ్లాం. తండ్రిని అడ్డం పెట్టుకొని మాకు పదవులు రాలేదు. భారాస పాపాలు పండాయి. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు ఇవాళ్టి పరిణామాలపై ఆలోచించాలి’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని