PK Politics: ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహమేంటీ..?

ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్‌ కిశోర్‌..కొద్ది రోజులుగా గాంధీ కుటుంబీకులు, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌తో పాటు ఇతర కీలక నేతలతో సుదీర్ఘ మంతనాలు జరుపుతుండడం మరోసారి చర్చనీయాంశమయ్యింది.

Published : 14 Jul 2021 18:44 IST

తాజా పరిణామాలపై దేశ రాజకీయాల్లో మరోసారి చర్చ

దిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్‌ కిశోర్‌.. దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన గాంధీ కుటుంబీకులు, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో పాటు ఇతర కీలక నేతలతో సుదీర్ఘ మంతనాలు జరుపుతుండడం మరోసారి చర్చనీయాంశమయ్యింది. పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న ముసలాన్ని తొలగించేందుకే భేటీ అవుతున్నారని తొలుత అనుకున్నప్పటికీ.. అంతకుమించిన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలే కాకుండా 2024 కేంద్రంలో భాజపాను గద్దె దించడంపై ఎన్‌డీయే వ్యతిరేక శక్తులతో  సమాలోచనలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తుత వ్యూహమేంటనే విషయం తాజాగా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రపతిగా శరద్‌ పవార్‌ కోసమేనా..?

ప్రస్తుత భారత రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చే ఏడాది జులై (2022)తో ముగుస్తుంది. ఈ సమయంలో ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత శరద్‌ పవార్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ మూడుసార్లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని వెల్లడించిన పీకే, కేవలం  పవార్‌ రాష్ట్రపతి అయ్యేందుకే లాబీయింగ్‌ చేస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అవసరమైన ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్ర సభ్యుల సంఖ్య సరిపోతుందని.. ఎన్‌డీయే వ్యతిరేక పార్టీలతో ఒడిశా ముఖ్యమంత్రి (బీజేడీ) ఒక్కరు చేతులు కలిపితే ప్రతిపక్ష అభ్యర్థికి అవకాశం ఉంటుందని పీకే లెక్కలు కట్టినట్లు సమాచారం. అందుకే వివిధ పార్టీల మద్దతు కోసం పీకే మంతనాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

గాంధీ కుటుంబంతో భేటీపై ఆసక్తి..

ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రతోనూ ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జులై 13న రాహుల్‌ నివాసంలో సమావేశమైన వీరు దాదాపు మూడు గంటలకుపైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. కేవలం పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపైనే చర్చించినట్లు తొలుత అనుకున్నప్పటికీ.. అంతకుమించి వీరిమధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భాజపాకు వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఏకం చేయడంపై దృష్టి సారించారని తెలిసింది. అంతేకాకుండా వీరి చర్చల మధ్యలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారని సమాచారం. ఈ సమయంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ పనితీరు, పార్టీ పుంజుకోవడంపై సాధ్యాసాధ్యాలను కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ప్రశాంత్‌ కిశోర్‌ వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముసలం నేపథ్యంలో..

గతకొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 23 మంది సీనియర్‌ నేతలు ఏకతాటిపైకి వచ్చి.. కాంగ్రెస్‌ అదిష్ఠానానికి వ్యతిరేకంగా తమ నిరసనగళం వినిపించారు. వీటితో పాటు పలురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న పంజాబ్‌, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీ పట్టు కోల్పోవద్దనే నిశ్చయంతో ఉంది. ఇలాంటి సమయంలోనే పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముసలం మొదలయ్యింది. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, సీనియర్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూల మధ్య కోల్డ్‌ వార్‌ మొదలు కావడం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. 2017 ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారంలోకి రావడానికి సహాయపడిన ప్రశాంత్‌ కిశోర్‌, అమరీందర్‌కు సన్నిహితంగా ఉన్నారు. దీంతో పీకే జోక్యంతో అక్కడి పరిస్థితులను చక్కబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందనే వాదన కూడా ఉంది.

భాజపాను గద్దె దించేందుకే..?

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు లేకుండా భాజపాను గద్దె దించడం సాధ్యపడదని శరద్‌ పవార్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీలు ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గతనెల 20వ తేదీన దిల్లీలో ఎనిమిది విపక్ష పార్టీల నేతలతో శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రశాంత్‌ కిశోర్‌ కూడా పాల్గొన్నారు. భాజపా వ్యతిరేక పార్టీలన్నీ కలిసి సగం లోక్‌సభ స్థానాలు సాధించడం ద్వారా కాషాయ పార్టీని అధికారం నుంచి తప్పించవచ్చనే సూత్రాన్ని ప్రశాంత్‌ కిశోర్ ప్రతిపాదించారు. దీని ప్రకారం, కాంగ్రెస్‌ సొంతంగా 136 సీట్లు, భాజపా వ్యతిరేక పార్టీలన్నీ కలిసి మరో 137 సాధించాల్సి ఉంటుంది. తద్వారా కేంద్రంలో అధికారానికి అవసరమైన 273 మార్కును చేరుకోవచ్చని ప్రశాంత్‌ కిశోర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

ఇక, ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్‌ కిశోర్‌కు పలు ప్రాంతీయ పార్టీ అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, జగన్‌ మోహన్‌ రెడ్డీలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. వీరితో పాటు నీతీశ్‌ కుమార్‌, అమరీందర్‌ వంటి ముఖ్యమంత్రులతోనూ అత్యంత దగ్గరగా మెలిగారు. తాజాగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌లతోనూ భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో పీకే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం మొదలయ్యింది. ఇలా గతకొద్ది రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో దేశంలో రాజకీయ సమీకరణాల్లో మార్పుకోసం ప్రశాంత్‌ కిశోర్‌ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని