Rahul Gandhi: రాహుల్‌పై అనర్హత.. కాంగ్రెస్‌ తదుపరి వ్యూహమేంటి..?

రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు అంశాన్ని కాంగ్రెస్‌ (Congress) పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై న్యాయపరంగా, రాజకీయంగానూ పోరాటం చేస్తామని స్పష్టం చేసింది.

Updated : 24 Mar 2023 18:55 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో ఆయన పార్లమెంటు సభ్యత్వంపై (MP) వేటు పడింది. అయితే, సూరత్‌ కోర్టు తీర్పు ఇచ్చిన 24గంటల్లోపే లోక్‌సభ సెక్రటేరియట్‌ నుంచి అనర్హత నిర్ణయం వెలువడటంపై కాంగ్రెస్‌ (Congress) ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ.. రాహుల్‌ వ్యవహారాన్ని న్యాయపరంగా, రాజకీయంగానూ ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తదుపరి ప్రణాళిక ఏంటనే విషయంపై ఆసక్తి నెలకొంది.

సీనియర్లతో భేటీ..!

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన వెంటనే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ముఖ్యులతో చర్చలు మొదలుపెట్టారు. సాయంత్రం మరోసారి పార్టీ సీనియర్లతో సమావేశమై.. తదుపరి ప్రణాళికను రచించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలోనే పై కోర్టులో అప్పీలు చేస్తామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ ఉద్ఘాటించారు. సూరత్‌ కోర్టు ఇచ్చిన 170 తీర్పు పత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు. అదానీ స్కామ్‌లో జేపీసీకి బదులు.. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందని మరో సీనియర్‌ నేత జైరాం రమేష్‌ విమర్శలు గుప్పించారు. మరోవైపు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

జైలుకు వెళ్లేందుకూ సిద్ధమే..

‘రాహుల్‌పై అనర్హత వేటు వేసేందుకు వాళ్లు (BJP) అన్ని విధాలా ప్రయత్నించారు. నిజాలను మాట్లాడేవారిని అడ్డుకోవాలని అనుకుంటున్నారు. కానీ, మేం వాస్తవాలను మాట్లాడుతూనే ఉంటాం. సంయుక్త పార్లమెంటరీ సంఘం (JPC) ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు అవసరమైతే జైలుకు వెళ్లేందుకూ సిద్ధమే’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మరోవైపు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడినట్లు ప్రకటన వచ్చిన వెంటనే.. 12 తుగ్లక్ లేన్‌లోని రాహుల్‌ నివాసానికి సోనియా గాంధీ (Sonia Gandhi) వెళ్లారు.

వయనాడ్‌ సీటు ఖాళీ..

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న వయనాడ్‌ స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎప్పుడైనా ఎన్నిక ప్రకటించవచ్చు. అయితే, ఈసారి మాత్రం రాహుల్‌ గాంధీ పోటీ చేసేందుకు అనర్హుడే అవుతారు. సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టు నిలిపివేస్తేనే రాహుల్‌ గాంధీకి ఊరట లభిస్తుంది. లేదంటే సుప్రీం కోర్టులోనూ పోరాటం చేసే వీలుంది. మరోవైపు ఆయన మాజీ ఎంపీ అయిన నేపథ్యంలో సెంట్రల్‌ దిల్లీలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని కూడా ఖాళీ చేయమని ప్రభుత్వం అడిగే అవకాశం ఉంది.

2024 ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?

ప్రస్తుతానికి దీనిపై న్యాయపరంగా పోరాడినప్పటికీ 2024 ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటనే విషయంపైనా చర్చ నడుస్తోంది. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. ఇటువంటి తరుణంలో అప్పీలు అనంతరం పై కోర్టు ఇచ్చే తీర్పుపైనే రాహుల్‌ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే.. రాహుల్ (Rahul Gandhi) కొద్ది వారాల క్రితం భారత్‌ జోడో యాత్రలో భాగంగా తన నివాసం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సొంతంగా ఒక ఇల్లు లేదని తెలిపారు. 1977లో ఇంటిని వీడాల్సి వచ్చిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ‘అప్పుడు మా ఇంట్లో ఒక విభిన్న వాతావరణం కనిపించింది. ఏం జరిగిందని అమ్మను అడిగాను. అప్పుడు ఆమె.. ఇంటిని విడిచి వెళ్తున్నామని చెప్పారు. ఇది మనది కాదని, ప్రభుత్వ ఇచ్చిన సదుపాయమని చెప్పారు’ అని వెల్లడించారు. ప్రస్తుతం 12,తుగ్లక్‌ లేన్‌లో ఉంటున్నానని, అది తనది కాదని తెలిపారు.

‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ (Rahul Gandhi) వ్యాఖ్యానించారంటూ గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై గురువారం విచారించిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల పాటు జైలు శిక్షవిధించింది. ఈ క్రమంలో అనర్హత వేటు పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని