Published : 16 May 2022 05:41 IST

ఒమిక్రాన్‌లో ఎందుకింత జోరు?

రోనా వైరస్‌లోని ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. మహమ్మారి తీరుతెన్నులను ఇది వేగంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు పెరగడానికి ఇది కారణమైంది. ఇప్పుడు ఒమిక్రాన్‌లో సబ్‌ వేరియంట్లు పెరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. బీఏ.2, బీఏ.4.. ఇప్పుడు కొత్తగా బీఏ.5 వచ్చింది. వీటివల్ల రీఇన్‌ఫెక్షన్లు మరింత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఉపరకాలు ఎందుకు వస్తున్నాయి? వైరస్‌ వేగంగా మార్పులకు లోనవుతోందా? దీనివల్ల భవిష్యత్‌లో కొవిడ్‌ ఎలా మారుతుంది వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయి?

కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 సహా అన్ని రకాల వైరస్‌లు నిరంతరం ఉత్పరివర్తనకు లోనవుతుంటాయి. అయితే వీటిలో అనేకం.. వ్యాధి వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతపై పెద్దగా ప్రభావం చూపబోవు. ఈ ఉత్పరివర్తనాలు ఒక వైరస్‌లో గణనీయ స్థాయిలో పోగుపడినప్పుడు మాత్రం దాన్ని భిన్న ఉపరకంగా పరిగణిస్తారు. ఆ ఉత్పరివర్తనాల్లో.. వ్యాధి వ్యాప్తి, తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే సామర్థ్యాన్ని పెంచేవి ఉంటేనే సంబంధిత ఉపరకాన్ని కొత్త వేరియంట్‌గా ప్రకటిస్తారు.

బీఏ సబ్‌ వేరియంట్‌ విషయంలో ఇదే జరిగింది. గణనీయంగా మార్పులు పోగుపడటం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కొత్త వేరియంట్‌గా ప్రకటించి, ఒమిక్రాన్‌ అని నామకరణం చేసింది. ఇది వేగంగా వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విశ్లేషించిన జన్యుక్రమాలన్నింటిలోనూ దాదాపుగా ఇదే కనిపించింది. ఒమిక్రాన్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందినందువల్ల ఉత్పరివర్తన చెందడానికి దానికి అనేక అవకాశాలు లభించాయి. సొంతంగా అది అనేక మార్పులను పోగేసుకుంది. అవి అనేక ఉపరకాలకు దారితీశాయి. మొదటి రెండింటిని బీఏ.1, బీఏ.2గా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బీఏ.1.1, బీఏ.3, బీఏ.4, బీఏ.5 కూడా చేరాయి. గతంలో డెల్టా వంటి వైరస్‌ వెర్షన్లలోనూ ఉపరకాలు వచ్చాయి. అయితే ఒమిక్రాన్‌ నుంచే ఎక్కువ సంఖ్యలో సబ్‌ వేరియంట్లు వచ్చాయి. వాటి ఉద్ధృతిలో మునుపటి వేరియంట్ల ఉపరకాలు కొట్టుకుపోయాయి.  

వైరస్‌ వేగంగా మార్పు చెందుతోందా?

కరోనా వైరస్‌ చాలా జోరుగా ఉత్పరివర్తనాలకు లోనవుతోందని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఈ వైరస్‌లో మార్పులు నెమ్మదిగానే జరుగుతున్నాయి. దీనితో పోలిస్తే ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు కనీసం నాలుగు రెట్లు వేగంగా ఉత్పరివర్తన చెందుతాయి.  

అయితే కొన్ని సందర్భాల్లో కరోనా వైరస్‌.. స్వల్పకాలంలో శరవేగంగా ఉత్పరివర్తన చెందుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఆ పరిస్థితుల్లో అది కొన్నివారాల పాటు సాధారణం కన్నా నాలుగు రెట్లు వేగంగా మార్పులకు గురవుతుంది. ఫలితంగా చాలా ఎక్కువగా ఉత్పరివర్తనాలను పోగేసుకుంటుంది. ఈ క్రమంలోనే వేగంగా వ్యాప్తి చెందడం, మరింత తీవ్ర వ్యాధిని కలిగించడం, రోగ నిరోధక స్పందనను ఏమార్చడం వంటి లక్షణాలు ఆ వైరస్‌కు వస్తాయి. ఒమిక్రాన్‌ మూలాలపైన, అది ఇన్ని ఉత్పరివర్తనాలకు లోనుకావడానికి కారణాలపై రెండు ప్రధాన సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకటి.. వ్యాధినిరోధక సామర్థ్యం తక్కువగా ఉన్న వ్యక్తి దీర్ఘకాలంపాటు కొవిడ్‌ బారిన సందర్భంలో ఈ వేరియంట్‌ పుట్టుకొచ్చి ఉంటుంది.రెండు.. మానవుల్లో పుట్టుకొచ్చిన ఈ వేరియంట్‌.. ఆ తర్వాత ఇతర జీవుల్లోకి వెళ్లి, తిరిగి మనుషుల్లోకి వచ్చి ఉంటుంది.

ఇదో కిటుకు  

కొత్త వేరియంట్ల పుట్టుకకు ఉత్పరివర్తనాలు ఒక్కటే కారణం కాదు. రీకాంబినేషన్‌ అనే వ్యూహం ద్వారా కూడా వైరస్‌లు కొత్త రకాలను పుట్టిస్తుంటాయి. ఒమిక్రాన్‌లోని ఎక్స్‌ఈ వేరియంట్‌ ఇలాగే వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఒక రోగి బీఏ.1, బీఏ.2 రకాలతో ఒకేసారి ఇన్‌ఫెక్షన్‌కు గురై ఉంటాడని, ఫలితంగా ఈ రెండు ఉపరకాల మధ్య జన్యుమార్పిడి జరిగి, ఒక హైబ్రిడ్‌ వేరియంట్‌ పుట్టుకొచ్చి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.  డెల్టా, ఒమిక్రాన్‌ రకాల మధ్య కూడా ఇలాంటి మిశ్రమం జరిగి డెల్టాక్రాన్‌ రకం పుట్టుకొచ్చింది.ఈ రీకాంబినెంట్లకు అధిక వ్యాప్తి, తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ సామర్థ్యం ఉన్నట్లు ఇప్పటివరకూ రుజువుకాలేదు. అయితే భవిష్యత్‌లో ఇలాంటి భరోసా ఉంటుందని చెప్పలేమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఈ ఉపరకాలతో సమస్యేంటి?

ఒమిక్రాన్‌కు సంబంధించిన ఉపరకాలు.. ముఖ్యంగా బీఏ.4, బీఏ.5 వల్ల ప్రజలకు రీ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరగొచ్చని పరిశోధనలు పేర్కొంటున్నాయి. గతంలో బీఏ.1 లేదా ఇతర ఉపరకాల బారినపడి, కోలుకున్నవారికీ ఇవి సోకే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టీకాలు పొందినవారూ వీటి బారినపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే కొద్ది వారాలు, నెలల్లో కొవిడ్‌ కేసులు భారీగా పెరగొచ్చని పేర్కొంటున్నారు. మూడో టీకాతో ఒమిక్రాన్‌ను, దాని ఉపరకాల వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమూ తప్పుతుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.

కన్నేసి ఉంచాల్సిందే

వైరస్‌ వ్యాప్తిలో ఉన్నంతకాలం, కొత్త రకాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వేరియంట్‌కు సంబంధించిన మరిన్ని ఉపరకాలు, రీకాంబినెంట్‌ రకాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచాల్సిందే. తద్వారా బహుళ లేదా నిర్దిష్ట వేరియంట్లపై పనిచేసే టీకాల అభివృద్ధికి వీలుంటుంది.

- ఈనాడు, ప్రత్యేక విభాగం

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని