CM Sukhu: ‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్‌ సీఎం

అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులని.. పౌరుల మనోభావాలను కించపరచడమే కాకుండా ఎన్నికలపై అనవసర భారం మోపుతారని హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు పేర్కొన్నారు.

Published : 06 May 2024 21:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధులపై హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులని అన్నారు. పౌరుల మనోభావాలను కించపరచడమే కాకుండా ఎన్నికలపై అనవసర భారం మోపుతారని అన్నారు. హమీర్పూర్‌ జిల్లాలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో హిమాచల్‌ సీఎం ఈవిధంగా వ్యాఖ్యానించారు.

‘ప్రభుత్వం, ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవి గురించి ప్రశ్న కాదు. ఇది ప్రజా ఓటును అగౌరవపరచడమే’ అని ముఖ్యమంత్రి సుఖు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాకు  ఓటు వేయడాన్ని ప్రస్తావిస్తూ సీఎం ఈవిధంగా వ్యాఖ్యానించారు. ఆ కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు చివరకు భాజపాలో చేరిపోయిన విషయం తెలిసిందే. అనంతరం స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుత ఎన్నికల్లో వారందరూ భాజపా తరఫున పోటీలో నిలిచారు.

హౌస్‌ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!

హమీర్పూర్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌.. స్థానికంగా ఎటువంటి అభివృద్ధి చేయలేదని సీఎం సుఖు ఆరోపించారు. మెడికల్‌ కాలేజీ ప్రతిపాదనలు ఆమోదం పొందాయని అసత్యాలు చెబుతున్నారన్నారు. తాము అధికారం చేపట్టి 15 నెలలు అయ్యిందని.. ఈ వ్యవధిలోనే ఇచ్చిన పదింటిలో ఐదు హామీలను నెరవేర్చామని అన్నారు. పాత పెన్షన్‌ పునరుద్ధరణ, మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం, పాలకు కనీస మద్దతు ధర పెంచడం వంటివి ఇందులో ఉన్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని