Corona Virus: కరోనా బాధితులను జాగిలాలు కచ్చితంగా గుర్తించగలవు!

శిక్షణ పొందిన జాగిలాలు... విమానాశ్రయాలకు వచ్చే కరోనా వైరస్‌ బాధిత ప్రయాణికులను సమర్థంగా గుర్తించగలవని తాజా అధ్యయనంలో తేలింది. పరీక్షల నిర్వహణకు తగిన వసతులు

Published : 18 May 2022 08:40 IST

ఫిన్లాండ్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

లండన్‌: శిక్షణ పొందిన జాగిలాలు... విమానాశ్రయాలకు వచ్చే కరోనా వైరస్‌ బాధిత ప్రయాణికులను సమర్థంగా గుర్తించగలవని తాజా అధ్యయనంలో తేలింది. పరీక్షల నిర్వహణకు తగిన వసతులు అందుబాటులో లేనప్పుడు... ఇలాంటి జాగిలాల ద్వారా మహమ్మారి కట్టడికి చర్యలు చేపట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌, పారాసైటిక్‌ ఇన్‌ఫెక్షన్లతో పాటు... శరీర జీర్ణక్రియల సమయంలో విడుదలయ్యే వివిధ సేంద్రియ సమ్మేళనాలను శునకాలు గుర్తించగలుగుతాయి. అయితే, ఫిన్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకి పరిశోధకులు- నాలుగు జాగిలాలకు కరోనా వైరస్‌ను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. అంతకుముందు వాటికి నిషేధిత ఔషధాలు, ప్రమాదకర వస్తువులు, క్యాన్సర్లను గుర్తించడంలోనూ తర్ఫీదు ఇచ్చారు. తర్వాత మొత్తం 420 మంది వాలంటీర్ల స్కిన్‌ స్వాబ్‌ నమూనాలను వాటి ముందు ఉంచగా... ఈ నాలుగు జాగిలాలు వారిలో 114 మంది కరోనా బాధితులను కచ్చితంగా గుర్తించాయి. మిగతా 306 మంది పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితం వచ్చినవారే కావడం విశేషం. ఏడు దఫాల శిక్షణ తర్వాత ఈ స్వాబ్‌ నమూనాలను అవి 92% కచ్చితత్వంతో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. 28 మంది బాధితులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా, వారిని సైతం జాగిలాలు గుర్తించడం విశేషం. ఒక్క కేసులో మాత్రం ఇవి తప్పుగా నెగెటివ్‌ అని గుర్తించాయని, రెండు నమూనాల వాసన సరిగా చూడలేదని వారు పేర్కొన్నారు. 2020 సెప్టెంబరు- 2021 ఏప్రిల్‌ మధ్య హెల్సింకి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులకు పీసీఆర్‌ పరీక్షలతో పాటు జాగిలాల ముందు ఆ నమూనాలను ఉంచగా... 98% కచ్చితత్వంతో వాటిని నెగెటివ్‌/పాజిటివ్‌గా గుర్తించినట్టు పరిశోధకులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని