ఎంటెక్‌ కంప్యూటర్స్‌ అభ్యర్థులకు ఎర్రతివాచీ: బీటెక్‌లో అధ్యాపకులుగా భారీ అవకాశాలు

ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్, సంబంధిత కొత్త బ్రాంచీల్లో పట్టభద్రులైన వారికి సహాయ ఆచార్యుడిగా పట్టం కట్టేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలలు

Updated : 30 Jan 2022 12:04 IST

వేతనాలూ పెంచిన  ఇంజినీరింగ్‌ కళాశాలలు
కొత్త బ్రాంచీల్లో భారీగా సీట్లు పెరగడమే కారణం 

ఈనాడు, హైదరాబాద్‌: ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్, సంబంధిత కొత్త బ్రాంచీల్లో పట్టభద్రులైన వారికి సహాయ ఆచార్యుడిగా పట్టం కట్టేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎర్రతివాచీ పరుస్తున్నాయి. నెలకు రూ.40 వేల వేతనాన్ని అందించేందుకు ముందుకొస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌ కాలేజీలు సీఎస్‌ఈ తదితర కొత్త బ్రాంచీల్లో బీటెక్‌ సీట్లు పెరగడమే ఇందుకు కారణం. 

మరో 20 ఏళ్లపాటు డిమాండ్‌!

రాష్ట్రంలో ఎంసెట్‌ కన్వీనర్‌ కోటాలో 80 వేల బీటెక్‌ సీట్లు ఉండగా...అందులో బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీ, సంబంధిత సీట్లు 44 వేల వరకు చేరుకున్నాయి. వాటిలో 95 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత పాఠ్యాంశాలను బోధించే అధ్యాపకులకు ఈ ఏడాది డిమాండ్‌ ఏర్పడింది. ఎంటెక్‌ సీఎస్‌ఈ, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ, మెషిన్‌ లెర్నింగ్, రోబోటిక్స్‌ లాంటి స్పెషలైజేషన్లలో పట్టా ఉంటే చాలు నెలకు రూ.40 వేలు వేతనం ఇచ్చి నియమించుకునేందుకు పలు కళాశాలలు పోటీపడ్డాయి. గత ఏడాది వరకు రూ.18-25 వేలు ఇవ్వగా ఈసారి కొన్ని కళాశాలలు రూ.36-40 వేల వరకు వేతనం ఇస్తున్నాయని ఓ కళాశాల డైరెక్టర్‌ ఒకరు చెప్పారు. ఓ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయం సహా మరికొన్ని కళాశాలలు పుణె, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాలకు కూడా వెళ్లి నియామకాలు చేపట్టాయి. ఈ ఏడాది సీఎస్‌ఈకి ఉన్న డిమాండ్‌ను చూసిన యాజమాన్యాలు వచ్చే ఏడాది మరిన్ని కొత్త బ్రాంచీల సీట్లు పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. మరో 20 ఏళ్ల వరకు సీఎస్‌ఈ, ఇతర కొత్త బ్రాంచీలకు డిమాండ్‌ ఉంటుందని, అందువల్ల ఆ బ్రాంచీలకు బోధించే అధ్యాపకులకు డిమాండ్‌ తప్పదని కళాశాల ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఎంత మంది అవసరమంటే?

ఏఐసీటీఈ లెక్కల ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అవసరం. ఆ ప్రకారం యాజమాన్య కోటాతో కలిపి బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత సీట్లు 62 వేల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో 62 వేల సీట్లకు 3,100 మంది అధ్యాపకులు అవసరం. ఆపై వచ్చే సంవత్సరం ఆ సంఖ్య రెట్టింపు కావాలి. ఈ ఏడాది బీటెక్‌లో చేరిన వారు చివరి ఏడాదిలోకి వచ్చేసరికి(2024-25 విద్యా సంవత్సరం) మొత్తం 9,300 మంది ఎంటెక్‌ పట్టభద్రులు..అదీ సంబంధిత స్పెషలైజేషన్‌లో చదివిన వారుండాలి. 

వెసులుబాటు ఇస్తున్నాం

ఒకేసారి కొత్త బ్రాంచీల సీట్లు పెరిగినందున సీఎస్‌ఈ బ్రాంచీల్లో 10 శాతం అధ్యాపకులు ఇతర బ్రాంచీల వారు ఉండొచ్చని, కాకపోతే వారు స్వయం పోర్టల్‌ ద్వారా రెండు సర్టిఫికెట్‌ కోర్సులు చేసే వారికి వెసులుబాటు ఇచ్చాం. వాటిని కొద్ది నెలల్లోనే పూర్తి చేయవచ్చు. - ఆచార్య మంజూర్‌ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూహెచ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని