టీ20 ప్రపంచకప్‌ కౌంట్‌డౌన్‌ మొదలు

వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌లో అద్భుతంగా నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జే షా అన్నారు. మెగా టోర్నీ కౌంట్‌డౌన్‌ ఆరంభ వేడుకలో అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో కలిసి పాల్గొన్నారు...

Published : 12 Nov 2020 20:29 IST

దుబాయ్‌: వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌లో అద్భుతంగా నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జే షా అన్నారు. మెగా టోర్నీ కౌంట్‌డౌన్‌ ఆరంభ వేడుకలో అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో కలిసి పాల్గొన్నారు. వాస్తవంగా ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరగాల్సింది. కొవిడ్‌-19 వల్ల దానిని 2022కు వాయిదా వేశారు. ఇక 2021 ఎడిషన్‌ షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌-నవంబర్‌లో ఉపఖండంలో జరగనుంది.

‘ప్రతి ఒక్కరి ఆరోగ్యం, రక్షణకు ఇబ్బంది లేకుండా ఈ టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తుంది. అభిమానులకు మంచి క్రికెట్‌ అనుభూతిని అందిస్తాం. అతిథి దేవోభవ అంటే ఏంటో 15 జట్లు, ఐసీసీ సభ్య బోర్డులకు చూపిస్తాం. ఏదేమైనప్పటికీ ఈ మహమ్మారి సమయంలో ఆంక్షల మధ్య టోర్నీ నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నదే. వినూత్న పద్ధతులు, విధానాలతో ఈ సవాళ్లను అధిగమిస్తామనే అనుకుంటున్నాం’ అని షా తెలిపారు.

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆటగాడిగా ప్రపంచకప్‌లో జట్టును నడిపించానని, ఇప్పుడు పాలకుడిగా ఈ సవాల్‌ను ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ‘ఐసీసీ టోర్నీల్లో ఆటగాడిగా ఎంతో ఆస్వాదించాను. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఉండే ఉత్సాహాన్ని మరేదీ అధిగమించలేదు. కోట్లాది మంది వీక్షించడమే ఇందుకు కారణం. 1987 ప్రపంచకప్‌ నుంచి భారత్‌కు మెగా టోర్నీలు నిర్వహించిన అనుభవం ఉంది’ అని దాదా అన్నారు. 2021 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌, నమీబియా, నెదర్లాండ్స్‌, ఒమన్‌, పపువా న్యూగినీ, స్కాట్లాండ్‌ జట్లు తలపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని