
RCB vs DC: ఉత్కంఠ పోరులో దిల్లీపై బెంగళూరు విజయం
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో దిల్లీని ఓడించింది. దిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లు శ్రీకర్ భరత్ (78), మాక్స్‌వెల్ (51) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనకు దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లి (4) త్వరగా ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్, మాక్స్‌వెల్ దూకుడుగా ఆడుతూ.. బెంగళూరు విజయ తీరాలకు చేర్చారు. ఏబీ డి విలియర్స్ (26) ఫర్వాలేదనిపించాడు. దిల్లీ బౌలర్లలో నోర్జే రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
చెమటోడ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నెమ్మదిగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసేసరికి 108/3తో నిలిచింది. శ్రీకర్ భరత్ (48; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (26) క్రీజులో ఉన్నారు. లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. నోర్జే వేసిన 0.5 బంతికి ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (0) అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నోర్జే వేసిన మూడో ఓవర్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (4) కూడా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్, డివిలియర్స్ ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టారు. అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్లో భరత్ ఒక సిక్స్, ఫోర్ బాదాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. అక్షర్ పటేల్ వేసిన పదో ఓవర్లో డివిలియర్స్ (26) శ్రేయస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రబాడ వేసిన 13వ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్లో మ్యాక్సీ రెండు బౌండరీలు బాదాడు. నోర్జే వేసిన 15వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ మరో రెండు ఫోర్లు కొట్టాడు.
చివర్లో ధాటిగా ఆడిన హెట్‌మయర్
దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (48; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (43; 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివర్లో హెట్‌మయర్ (29; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త ధాటిగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (18) ఫర్వాలేదనిపించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు శుభారంభం అందించారు. నిలకడగా పరుగులు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. దీంతో 10 ఓవర్లకు 88/0తో నిలిచింది. హర్షల్ పటేల్ వేసిన 10.1 బంతికి ధావన్.. క్రిస్టియాన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చాహల్ వేసిన తర్వాతి ఓవర్లోనే పృథ్వీ షా కూడా పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. క్రిస్టియాన్ వేసిన 15వ ఓవర్లో హెట్‌మయర్ ఫోర్, సిక్స్ బాదాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఒక ఫోర్ బాదడంతో ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. సిరాజ్ వేసిన 17.4 బంతికి అయ్యర్ ఔటయ్యాడు. సిరాజ్ వేసిన చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి హెట్‌మయర్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రెండు, చాహల్, హర్షల్ పటేల్, డేనియల్ క్రిస్టియాన్ తలో వికెట్ తీశారు.
రెండు వికెట్లు కోల్పోయిన దిల్లీ క్యాపిటల్స్
దిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్లు కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 10.1 బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్ (43; 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔట్ కాగా.. చాహల్ వేసిన 11.2 బంతికి పృథ్వీ షా(48; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) గార్టన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సిరాజ్ వేసిన ఏడో ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. చాహల్ వేసిన తర్వాతి ఓవర్‌లో పృథ్వీ ఓ ఫోర్ కొట్టాడు. దాంతో పాటు ఐదు సింగిల్ వచ్చాయి. హర్షల్ పటేల్ వేసిన 8.5 బంతికి ధావన్ సిక్స్ కొట్టగా.. చాహల్ వేసిన 9.4 బంతిని పృథ్వీ స్టాండ్స్‌కి పంపించాడు. 12 ఓవర్లకు దిల్లీ క్యాపిటల్స్ 105/2తో నిలిచింది. రిషభ్ పంత్ (8), శ్రేయస్ అయ్యర్ (1) క్రీజులో ఉన్నారు.
దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు శిఖర్ ధావన్ (27; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), పృథ్వీ షా (24; 17 బంతుల్లో 3 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు. మ్యాక్స్‌వెల్ వేసిన మొదటి ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. తర్వాత సిరాజ్ వేసిన ఓవర్‌లో పృథ్వీ షా, ధావన్ చెరో బౌండరీ బాదారు. మ్యాక్సీ వేసిన మూడో ఓవర్‌లో ఐదు, జార్జ్ గార్టన్ వేసిన నాలుగో ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మ్యాక్స్‌వెల్ వేసిన ఐదో ఓవర్‌లో ధావన్ సిక్స్ కొట్టగా.. పృథ్వీ బౌండరీ బాదాడు. గార్టన్ ఆరో ఓవర్లో ధావన్, పృథ్వీ షా చెరో బౌండరీ కొట్టారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి దిల్లీ క్యాపిటల్స్ 55/0తో నిలిచింది.
టాస్ గెలిచిన బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్ల మధ్య మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. పది విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న దిల్లీ.. ఈ మ్యాచులో కూడా విజయం సాధించి ఆధిపత్యం కొనసాగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు బెంగళూరు జట్టు చివరి మ్యాచులో హైదరాబాద్ చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. ఆ ఓటమి నుంచి తేరుకుని మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), డేనియల్ క్రిస్టియన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహమ్మద్ సిరాజ్ ,యుజువేంద్ర చాహల్.
దిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిపాల్ పటేల్, షిమ్రోన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, రవి చంద్రన్ అశ్విన్, అవేశ్అఖాన్, రబాడ, నోర్జే
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.