Updated : 11 Nov 2021 10:01 IST

IPL: ఐపీఎల్‌ కుర్రాళ్లు అదరహో

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వైఫల్యానికి ఐపీఎల్‌ ముఖ్య కారణమంటూ నిందించారు కొంతమంది. కానీ భారత క్రికెట్లో ఎంతోమంది కుర్రాళ్లు వెలుగులోకి రావడానికి, ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించడానికి కారణం ఐపీఎల్‌ అనడంలో సందేహమే లేదు. ఈ లీగ్‌ ద్వారా ప్రతిభ చాటుకుని టీమ్‌ఇండియా తలుపు తట్టిన కుర్రాళ్ల జాబితా చాలా పెద్దదే. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకో నలుగురు యువ ప్రతిభావంతులొచ్చారు. వాళ్ల నేపథ్యాలేంటో చూద్దాం పదండి.

రుతురాజ్‌ గైక్వాడ్‌

మహారాష్ట్ర కుర్రాడు టీమ్‌ఇండియాకు కొత్తేమీ కాదు. ఇప్పటికే భారీ జట్టు తరఫున రెండు టీ20లు ఆడాడు కానీ.. అవి పూర్తి స్థాయి మ్యాచ్‌లుగా చెప్పలేం. కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో ఉండగా ధావన్‌ నేతృత్వంలో శ్రీలంకకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టులో అతను సభ్యుడు. 2 మ్యాచ్‌ల్లో 35 పరుగులే చేసిన రుతురాజ్‌ తనదైన ముద్రను వేయలేకపోయాడు. అయితే ఈ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అతను టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలవడం విశేషం. అంతకుముందు మహారాష్ట్ర తరఫున దేశవాళీల్లోనూ సత్తా చాటిన రుతురాజ్‌.. ఐపీఎల్‌ ప్రదర్శనతో భారత జట్టులో తనకు చోటివ్వక తప్పని పరిస్థితి కల్పించాడు. మంచి టెక్నిక్‌కు తోడు ధాటిగానూ ఆడగల నైపుణ్యం ఉన్న రుతురాజ్‌ భారత జట్టు భవిష్యత్‌ ఆశాకిరణాల్లో ఒకడిగా కనిపిస్తున్నాడు. న్యూజిలాండ్‌ లాంటి పెద్ద జట్టుపై, పూర్తి స్థాయిలో అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్న రుతురాజ్‌.. ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.


వెంకటేశ్‌ అయ్యర్‌

టా ఐపీఎల్‌లో ఒకరిద్దరు కొత్త కుర్రాళ్లు వెలుగులోకి వస్తుంటారు. లీగ్‌పై తమదైన ముద్ర వేస్తుంటారు. 2021 సీజన్లో అలా అందరి దృష్టినీ ఆకర్షించిన ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌. ప్లేఆఫ్‌ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిన స్థితిలో.. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ రెండో దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రాత మార్చిన కుర్రాడితను. ఓపెనింగ్‌లో మెరుపులతో బ్యాటింగ్‌ పరంగా జట్టుకు స్థిరత్వం తీసుకురావడమే కాదు.. పార్ట్‌టైం బౌలర్‌గా, మేటి ఫీల్డర్‌గా నైట్‌రైడర్స్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాడు. వెంకటేశ్‌ ఆట చూసిన చాలామంది అతడికి గొప్ప భవిష్యత్‌ ఉందని తేల్చారు. ఆ అంచనాలకు తగ్గట్లే ఆలస్యం చేయకుండా అతను టీమ్‌ఇండియాలోకి వచ్చేశాడు. హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేయలేకపోతుండటం అతడి స్థానంలో అయ్యర్‌కు అవకాశం దక్కింది. దేశవాళీల్లోనూ మంచి రికార్డున్న అయ్యర్‌.. తనపై ఉన్న అంచనాలను ఏమేర నిలబెట్టుకుంటాడో చూడాలి.


హర్షల్‌ పటేల్‌

మ్యాచ్‌లు 15.. వికెట్లు 32.. సగటు 14.34.. ఉత్తమ ప్రదర్శన 5/27.. ఐపీఎల్‌-14లో బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ గణాంకాలివి. ఈ ఏడాదికి అతనే అత్యధిక వికెట్ల వీరుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ స్టార్‌ బౌలర్లను మించి ఐపీఎల్‌లో అతను గొప్పగా బౌలింగ్‌ చేశాడు. మేటి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి ఔరా అనిపించాడు. మ్యాచ్‌లో కీలక సందర్భాల్లో ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లి చాలా మ్యాచ్‌ల్లో ఈ దేశవాళీ బౌలర్‌నే నమ్ముకున్నాడు. కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న ఈ గుజరాత్‌ బౌలర్‌.. ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఎ క్రికెట్లోనూ ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇంకా ముందే టీమ్‌ఇండియాలోకి రావాల్సి ఉన్నప్పటికీ.. ఆలస్యంగా అయినా అవకాశం దక్కినందుకు హర్షల్‌ ఎంతో ఆనందంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్న హర్షల్‌ కివీస్‌పై అవకాశాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటాడో చూడాలి.


అవేష్‌ ఖాన్‌

పీఎల్‌ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌లో రబాడ, నార్జ్‌ లాంటి మేటి అంతర్జాతీయ బౌలర్లున్నారు. అయితే వాళ్లకు దీటుగా, ఇంకా చెప్పాలంటే వాళ్లను మించి రాణించడం ద్వారా అవేష్‌ ఖాన్‌ అందరి దృష్టినీ ఆకర్షించాడు. యువ ప్రతిభకు నిలయంగా మారిన దిల్లీ జట్టులో గత రెండు సీజన్లలో అవేష్‌ గొప్పగా రాణించాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌ల్లో 18.75 సగటుతో 24 వికెట్లతో.. టోర్నీ టాప్‌ వికెట్‌ టేకర్లలో రెండో స్థానంలో నిలిచాడు. వేగం, వైవిధ్యం రెండూ ఉన్న ఈ మధ్యప్రదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ 27 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 100 వికెట్లు పడగొట్టి దేశవాళీల్లోనూ సత్తా చాటుకున్నాడు. 24 ఏళ్ల అవేష్‌ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే ప్రతిభ చూపిస్తే.. చాలా కాలం టీమ్‌ఇండియాకు ఆడే అవకాశముంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని