బుమ్రాను ముందే కట్టడిచేయాలి.. లేదంటే అంతే!

టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఆదిలోనే కట్టడి చేయాలని లేదంటే కష్టమని ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ అభిప్రాయపడ్డాడు. బుమ్రా ప్రత్యేకమైన బౌలర్‌ అని, అతడి యాక్షన్‌ వేరుగా ఉంటుందని...

Published : 19 Nov 2020 15:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఆదిలోనే కట్టడి చేయాలని లేదంటే కష్టమని ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ అభిప్రాయపడ్డాడు. బుమ్రా ప్రత్యేకమైన బౌలర్‌ అని, అతడి యాక్షన్‌ వేరుగా ఉంటుందని అన్నాడు. తాజాగా అక్కడి మీడియాతో మాట్లాడిన అతడు టీమ్‌ఇండియా పేసర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. సిరీస్‌ ఆసాంతం రోజంతా బుమ్రా తన పేస్‌ను కొనసాగిస్తాడని చెప్పాడు. దాంతో అతడు కీలకంగా మారతాడన్నాడు. తన బౌలింగ్‌ నైపుణ్యాలతో ఆదిలో వికెట్లు పడగొట్టడమే కాకుండా పాత బంతితోనూ తీయగలడని కొనియాడాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ముందే కట్టడి చేయాలన్నాడు. 

మరోవైపు టీమ్‌ఇండియా పేస్‌ విభాగం కూడా బలంగా మారిందని, కొన్నేళ్లుగా బుమ్రా, షమి, ఇషాంత్‌ మెరుగువుతున్నారని చెప్పాడు. 2018-19 సీజన్‌లో ఈ ముగ్గురు తమని కట్టడి చేశారని, అందువల్లే కోహ్లీసేన సిరీస్‌ గెలిచిందని చెప్పాడు. టీమ్‌ఇండియా చారిత్రక గెలుపులో ఆ ముగ్గురు కీలక పాత్ర పోషించారని స్పష్టంచేశాడు. ఇప్పుడు గాయం బారిన పడిన ఇషాంత్‌ తిరిగి జట్టులో చేరితే భారత బౌలింగ్‌ దళం మరింత బలంగా మారుతుందని ధీమా వ్యక్తంచేశాడు. దీంతో వారిపై ఆధిపత్యం చలాయించాలంటే తమ బ్యాట్స్‌మెన్‌కు కత్తిమీద సామేనని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. భారత్‌, ఆస్ట్రేలియా ఈనెల 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు ఆపై నాలుగు టెస్టులు ఆడుతున్న సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని