సచిన్‌ విషయంలో అలా చూసి షాకయ్యా..

ఒకసారి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ మైదానంలోకి ఆలస్యంగా రావడంతో మీడియా సమావేశంలో ఒక ఆశ్చర్యకర సన్నివేశం చూశానని దిగ్గజ అంపైర్‌ డారిల్‌ హార్పర్‌...

Published : 25 Jul 2020 14:16 IST

2007 నాటి టెస్టును గుర్తుచేసుకున్న డారిల్‌ హార్పర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకసారి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ మైదానంలోకి ఆలస్యంగా రావడంతో మీడియా సమావేశంలో ఒక ఆశ్చర్యకర సన్నివేశం చూశానని దిగ్గజ అంపైర్‌ డారిల్‌ హార్పర్‌ పేర్కొన్నాడు. 2007లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లిటిల్‌ మాస్టర్‌ ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ విషయాన్ని నాటి అంపైర్‌ డారిల్‌ హార్పర్‌ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా ఓపెనర్లు వసీం జాఫర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ త్వరగా ఔటయ్యారు. మరోవైపు సచిన్‌ ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. అయినా మైదానంలోకి రాలేదు. అప్పటికే మూడు నిమిషాలు దాటడంతో దక్షిణాఫ్రికా సారథి గ్రేమ్‌స్మిత్‌ క్రికెట్‌ రూల్స్‌ ప్రకారం టైమ్‌ ఔట్‌ డిస్మిసల్‌ ప్రకటించాలని అంపైర్‌ను కోరాడు. 

అయితే, స్మిత్‌ను అలా అప్పీల్‌ చేయొద్దని డారిల్‌ సర్ది చెప్పాడు. ఏదో కారణం చేత ఆలస్యమైండొచ్చని వివరించాడు. అంతకుముందు రోజు సచిన్‌ గాయపడడంతో ఆట మధ్యలోనే మైదానం వీడినట్లు వారికి గుర్తుచేశాడు. అప్పుడే ఫోర్త్‌ అంపైర్‌ కూడా సచిన్‌ మైదానంలోకి వెళ్లలేడని గుర్తుచేయడంతో తర్వాతి బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రవిడ్‌,  సౌరభ్‌ గంగూలీ ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యారు. అలా ఆలస్యం జరిగిందని డారిల్‌ నాటి విశేషాలను గుర్తుచేసుకున్నాడు. చివరగా సచిన్‌ గంగూలీ తర్వాత ఐదో స్థానంలో ఆడాడని తెలిపాడు. అయితే, ఆ రోజు ఆట పూర్తయ్యాక తాను ప్రెస్‌మీట్‌లో పాల్గొనాల్సి వచ్చిందని, అప్పుడు తానేదో పది మంది జర్నలిస్టులు ఉంటారనుకుంటే ఏకంగా 50 మంది ఉన్నారని చెప్పాడు. 

వాళ్లంతా సచిన్‌ ఆలస్యానికి గల కారణం తెలుసుకోడానికి ఉన్నారని, తన జవాబు కోసం అంతమంది ఎదురుచూడటం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు. అయితే, టీమ్‌ఇండియా ఎక్కడ పర్యటించినా వారికి విశేషమైన ఫాలోయింగ్‌ ఉంటుందని, అందుచేతనే మీడియా కవరేజ్‌ కూడా భారీగా ఉంటుందని తనకు తానే సర్ది చెప్పుకున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తాను ఒకసారి న్యూయార్క్‌లో ఇంటికి వెళుతుంటే ముగ్గురు భారతీయులు తనని ఆపి క్రికెట్‌కు సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. వారెవరో తనకు తెలియకపోయినా తనని గుర్తుపట్టి అలా మాట్లాడటం బాగుందన్నాడు. వాళ్లెంతో మర్యాదగా ప్రవర్తించారని డారిల్‌ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని