T20 World Cup:హార్దిక్ బౌలింగ్‌ చేయకపోవడం టీమ్‌ఇండియాకు దెబ్బే:ఆకాశ్‌ చోప్రా

హార్దిక్ పాండ్య.. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌. ఒంటిచేత్తో మ్యాచ్‌ని మలుపు తిప్పగల సమర్థుడు. బంతితోనూ రాణించే సత్తా ఉన్న ఆటగాడు. అయితే, 2019లో వెన్ను భాగంలో శస్త్ర చికిత్స అనంతరం బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ ఒక్క ఓవర్‌ కూడా

Published : 22 Oct 2021 01:46 IST

(Photo: Hardik Pandya Twitter)

ఇంటర్నెట్ డెస్క్: హార్దిక్ పాండ్య.. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌. ఒంటిచేత్తో మ్యాచ్‌ని మలుపు తిప్పగల సమర్థుడు. బంతితోనూ రాణించే సత్తా ఉన్న ఆటగాడు. అయితే, 2019లో వెన్ను భాగంలో శస్త్ర చికిత్స అనంతరం బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్ చేయలేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌కి ఈ ఆల్‌రౌండర్‌ ఎంపికయ్యాడు. కాగా, ఈ మెగా టోర్నీలో హార్దిక్ బౌలింగ్‌కు దూరంగా ఉండటం భారత్‌కు ఇబ్బంది కలిగిస్తుందని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హార్దిక్‌ పాండ్య.. బౌలింగ్‌ చేయకపోవడం టీమ్‌ఇండియాను దెబ్బతీస్తుందని, అతడు కొన్ని ఓవర్లు బౌలింగ్‌ చేసినా జట్టుకు ఎంతో లాభం చేకూరుతుందని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

‘హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేయకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం. ఎందుకంటే టీమ్‌ఇండియా ఐదుగురు బౌలర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఆల్‌రౌండర్ రూపంలో ఆరో బౌలర్‌ లేడు. 2016లో మాదిరిగా విరాట్‌ కోహ్లి బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. అది టీమ్ఇండియాను దెబ్బతీస్తుంది. హార్దిక్‌ కొన్ని ఓవర్లు బౌలింగ్‌ చేసినా జట్టుకు ఎంతో లాభం చేకూరుతుంది’అని  చోప్రా వివరించాడు.

మరోవైపు, టీమ్‌ఇండియా మొదటి ఎంపిక తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కదని, ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని జట్టు యాజమాన్యం భావిస్తే అశ్విన్‌ తుది జట్టులో ఉంటాడని చోప్రా అభిప్రాయపడ్డాడు.‘టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని భావిస్తే లేదా ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉంటే అశ్విన్‌ తుది జట్టులో ఉంటాడు. రవీంద్ర జడేజా కచ్చితంగా ఆడతాడు. అతడు బౌలర్‌గా ఎదిగాడు. కానీ, టీమ్‌ఇండియాకు  పూర్తిస్థాయి టీ20 బౌలర్‌ కాదు’ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఇదిలా ఉండగా, టీ20 ప్రపంచకప్‌ వార్మప్ మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలను మట్టికరిపించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రధాన టోర్నీ మ్యాచ్‌లకు సిద్ధమైంది. అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని