Sunil Gavaskar: ఆ విషయం తెలియగానే.. పెన్ను తీసుకుని పరిగెత్తాను : గావస్కర్‌

ఎంఎస్‌ ధోనీ(MS Dhoni) అంటే ఇష్టపడని వారుండరు. దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) కూడా.. చిన్న పిల్లాడి మాదిరిగా మహీ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు.

Updated : 16 May 2023 15:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సీజన్‌ (IPL 2023)లో చెన్నై (Chennai Super Kings) తన సొంత మైదానం వేదికగా చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఇటీవల ఆడేసింది. దీంతో తమ జట్టుకు మద్దతు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు మరిచిపోలేని బహుమతులను అందించాడు ధోనీ. మ్యాచ్ ముగిశాక.. చెన్నై ఆటగాళ్లు మైదానంలో పరేడ్‌ నిర్వహించారు. ఇక కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ(MS Dhoni).. టెన్నిస్‌ రాకెట్లను పట్టుకుని జెర్సీలను అభిమానుల వైపు విసురుతూ.. సీఎస్‌కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌(Sunil Gavaskar) మైదానంలోకి వచ్చి తన షర్ట్‌పై మహీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే.. ఆ సమయంలో స్టేడియంలో ఏం జరుగుతుందో తనకు ముందుగా తెలియలేదని.. అప్పుడు తాను సిద్ధంగా కూడా లేనని సన్నీ వివరించాడు.

‘చెపాక్‌ స్టేడియంలో ధోనీతో కలిసి ఆటగాళ్లంతా కలియతిరిగి అభిమానులకు అభివాదం చేస్తారన్న సంగతి నాకు తెలియదు. ఆ విషయం తెలియగానే.. ప్రత్యేకంగా గుర్తుండేలా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. వెంటనే ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని పరుగెత్తాను. చెపాక్‌లో వారి చివరి గేమ్‌ ఇదే. చెన్నై ప్లేఆఫ్స్‌ చేరితే మరో మ్యాచ్‌ ఇక్కడ ఆడే అవకాశం ఉంది. కానీ.. నేను ఆ క్షణాన్ని ప్రత్యేకంగా చేయాలనుకున్నాను. అదే సమయంలో కెమెరా యూనిట్‌లో ఒకరి వద్ద మార్కర్‌ పెన్ను ఉండటం నా అదృష్టం. అతడి వద్ద పెన్ను అడిగి తీసుకున్నాను. ఆ వ్యక్తికి కూడా నా కృతజ్ఞతలు’ అని గావస్కర్‌ వివరించాడు.

‘వెంటనే మహీ వద్దకు వెళ్లి నా షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ కావాలని అడిగాను. అతడు దానికి అంగీకరించడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఇది నాకు ఎంతో ఉద్వేగభరితమైన క్షణం’ అని సన్నీ పేర్కొన్నాడు.

ఇక ధోనీ గురించి మాట్లాడుతూ..‘అతడిని ఎవరు ప్రేమించరు చెప్పండి? భారత క్రికెట్‌ కోసం ఎంతో చేశాడు. అది అద్భుతం. అతడు ఎలాంటి రోల్‌మోడల్‌గా నిలిచాడనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. భారత్‌లో ఎంతో మంది యువకులు ఉన్నారు. వారందరికీ మహీ స్ఫూర్తిగా నిలుస్తాడు’ అని కొనియాడాడు.

ఇక గావస్కర్‌.. భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే రెండు ప్రత్యేకమైన క్షణాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ‘కపిల్‌ దేవ్‌ 1983లో ప్రపంచకప్‌ ట్రోఫీని ఎత్తుకున్న సందర్భం .. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోనీ విన్నింగ్‌ సిక్స్‌ కొట్టడం.. నేను చనిపోయే ముందు చూడాలనుకుంటున్న ప్రత్యేకమైన క్షణాలు ఇవే’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు సన్నీ.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు