WI v IND: ‘500’ వికెట్ల క్లబ్‌లో అశ్విన్‌ - జడేజా.. వారిద్దరి రికార్డుపై కన్ను !

విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇప్పటి వరకు 500 వికెట్లు తీసిన రెండో జోడీగా అశ్విన్‌, రవీంద్ర జడేజా నిలిచారు. 

Updated : 24 Jul 2023 13:57 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌కు 90వ దశకంలో టాప్‌ స్పిన్నర్‌ అంటే అనిల్‌ కుంబ్లేనే..! కొన్నాళ్లకు హర్భజన్‌ తోడయ్యాడు. ఈ జోడి తర్వాత ఎవరా..? అనే ప్రశ్నకు సమాధానంగా మరో ఇద్దరు స్పిన్నర్లు అదరగొట్టేస్తున్నారు. వారే రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా. కుడి, ఎడమ చేతివాటం కలిగిన వీరిద్దరూ జట్టులో ఉంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేలా పోరాడతారు. ఈ క్రమంలో వీరిద్దరూ అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటి వరకు 500 వికెట్లు తీసిన రెండో జోడీగా అశ్విన్‌ (Ashwin), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నిలిచారు. అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ (Anil Kumble-Harbhajan Singh) కలిసి 501 వికెట్లు తీశారు. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు పడగొడితే వారి రికార్డును అశ్విన్‌- జడేజా జోడీ అధిగమించేస్తుంది.

అశ్విన్, జడేజా కలిసి ఆడిన 49వ టెస్టులో 500 వికెట్ల మైలురాయిని చేరుకొన్నారు. ఇందులో అశ్విన్ 274 వికెట్లు, జడేజా 226 వికెట్లు పడగొట్టారు. ఈ జోడీ ఇప్పటి వరకు కలిసి ఆడిన టెస్టుల్లో 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన, 8 సార్లు 10+ వికెట్ల ప్రదర్శన చేశారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సందర్భంగా జడేజాతో కలిసి బౌలింగ్‌ చేయడంపై  అశ్విన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘అతడు అద్భుతమైన ఆటగాడు. అలాంటి బౌలర్‌తో బౌలింగ్‌ చేయడం బాగుంటుంది’ అని అన్నాడు.

అత్యధిక వికెట్లు వీరివే..

  • అనిల్ కుంబ్లే (281), హర్భజన్ సింగ్ (220) - 54 టెస్టుల్లో 501
  • అశ్విన్ (274), రవీంద్ర జడేజా (226) - 49 టెస్టుల్లో 500*
  • బిషన్ బేడీ (184),  బిఎస్ చంద్రశేఖర్ (184) - 42 టెస్టుల్లో 368
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని