విహారి ఇన్నింగ్స్‌ శతకంతో సమానం 

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4) ఇన్నింగ్స్‌ శతకంతో సమానమని సహచర ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌(39; 128 బంతుల్లో 7x4) ప్రశంసించాడు...

Updated : 11 Jan 2021 19:05 IST

ఈ మ్యాచ్‌తో గర్వపడొచ్చు: అశ్విన్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4) ఇన్నింగ్స్‌ శతకంతో సమానమని సహచర ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌(39; 128 బంతుల్లో 7x4) ప్రశంసించాడు. భారత్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో వారిద్దరూ కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. 272/5తో ఓటమి వైపు నిలిచిన జట్టును విహారి, అశ్విన్‌ ఆదుకున్నారు. చివరి వరకూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి ఆసీస్‌ విజయానికి అడ్డుకట్ట వేశారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి భారత్‌ స్కోరును 334/5కి తీసుకెళ్లారు. మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ మాట్లాడుతూ విహారిని పొగడ్తలతో ముంచెత్తాడు.

‘ఆఖరి సెషన్‌ చాలా ఆసక్తిగా మారింది. కమిన్స్‌ చాలా వైవిధ్యంగా బంతులేశాడు. దాంతో అతడిని ఎదుర్కోవడం కష్టంగా మారింది. అయితే, నెట్స్‌లో నేను చాలాసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాను. అలా ఇక్కడ నిలదొక్కుకోవడం గొప్పగా అనిపించింది. సిడ్నీలో 400 స్కోర్‌ను ఛేదించడం అంత తేలిక కాదు. పంత్‌(97) బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలోనే పంత్‌, పుజారా ఔటయ్యాక విహారి గాయపడ్డాక గెలుపు కోసం ప్రయత్నించడం చాలా కష్టం. ఆస్ట్రేలియాలో రాణించడం అంత తేలిక కాదు కాబట్టి విహారి తన బ్యాటింగ్‌ పట్ల గర్వపడొచ్చు. అతడి ఇన్నింగ్స్‌ శతకంతో సమానం. ఈ మైదానంలో అర్ధశతకం సాధించకుండా ఎప్పుడూ నేను ఆటను ముగించలేదని భోజన విరామంలో మా బ్యాటింగ్‌ కోచ్‌కు చెప్పాను. అలాగే ఈ రోజు కూడా బ్యాటింగ్‌లో రాణించాను’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. 

ఇవీ చదవండి..

విహారి, అశ్విన్‌ కాపాడారు.. 

సరిలేరు నీకెవ్వరు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని