Ashwin: అతడు సెలెక్షన్ గురించి పట్టించుకోడు.. పరుగులు చేయడమే తెలుసు: అశ్విన్‌

టీమ్‌ఇండియా (Team India) జట్టులోకి వచ్చేందుకు విపరీతమైన పోటీ ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తారు. దేశవాళీలో అదరగొడితే జాతీయ జట్టులో స్థానం వస్తుందనే ఆశతో చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. 

Updated : 30 Jan 2023 20:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు సాధిస్తూ.. జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్న క్రికెటర్లలో సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan) ముందు వరుసలో ఉన్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. కానీ, ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు మాత్రం జట్టులో ఎంపిక కాలేకపోయాడు. ఎప్పట్నుంచో వేచి ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు (Surya kumar Yadav) అవకాశం వచ్చింది. కాస్త లావుగా ఉన్నాడనే కారణంతోనే ఇలా పక్కన పెట్టారనే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వినిపించాయి. దీంతో క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్ కూడా సెలెక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాజూగ్గా ఉండాలంటే ఫ్యాషన్‌ షోలకు వెళ్లి మోడల్స్‌ను తీసుకొచ్చి బ్యాటింగ్‌, బౌలింగ్‌ నేర్పించమని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలెక్టర్ శ్రీధరన్‌ శరత్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. తమ దృష్టిలో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఉన్నాడని, జట్టులో సమతూకం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి నిర్ణయం తీసుకొంటామని వెల్లడించారు. ఈ క్రమంలో టీమ్ఇండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) కూడా సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుతమైన ఫామ్‌ను అభినందించాడు. 

‘‘సర్ఫరాజ్‌ ఖాన్‌ గురించి చెప్పడానికి ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే అతడు జట్టులోకి సెలెక్ట్ అవుతాడా..? లేదా..? అనే విషయంపై చర్చ జరిగింది. అయితే అతడేమీ సెలెక్షన్ గురించి పట్టించుకోకుండా తన పనేదో చేసుకుంటూ పోతున్నాడు. 2019-20 దేశవాళీ సీజన్‌లో 900 పరుగులు, 2020-21 సీజన్‌లో కూడా దాదాపు వెయ్యి పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లోనూ ఇప్పటి వరకు 600 రన్స్‌ చేశాడు. అతడి సూపర్ ప్రదర్శనతో తన ఉద్దేశం ఏంటో చాటి చెప్పాడు. సర్ఫరాజ్‌ కేవలం సెలెక్షన్ కమిటీ తలుపులను మాత్రమే బాదలేదు. అందులోని సభ్యులను కూడా దహించివేసేలా చేశాడు. దురదృష్టవశాత్తూ అతడు ఎంపిక కాలేకపోయాడు. అతడు సెలెక్ట్‌ కాకపోయినా.. ముంబయి తరఫున దిల్లీ మీద భారీ ఇన్నింగ్స్ ఆడాడు’’ అని  అశ్విన్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని