WTC Final: ఆ బంతికి విరాటేంటి ఎవరైనా ఔటే!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని పెవిలియన్‌ పంపిన బంతికి ఎవరైనా ఔటవుతారని న్యూజిలాండ్‌ యువ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ అన్నాడు. వరుసగా ఔట్‌ స్వింగర్లు ఎదుర్కొని హఠాత్తుగా ఇన్‌స్వింగర్‌ ఆడటం కష్టమేనని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి కోహ్లీసేనను దెబ్బకొట్టిన అతడు...

Published : 21 Jun 2021 11:38 IST

విరాట్‌కు వేసిన బంతిపై జేమీసన్‌

సౌథాంప్టన్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని పెవిలియన్‌ పంపిన బంతికి ఎవరైనా ఔటవుతారని న్యూజిలాండ్‌ యువ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ అన్నాడు. వరుసగా ఔట్‌ స్వింగర్లు ఎదుర్కొని హఠాత్తుగా ఇన్‌స్వింగర్‌ ఆడటం కష్టమేనని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి కోహ్లీసేనను దెబ్బకొట్టిన అతడు మీడియాతో మాట్లాడాడు.

యువ పేసర్‌ జేమీసన్‌ అనుకున్నట్టుగానే న్యూజిలాండ్‌ను ముందంజలో నిలిపాడు. తన పొడవు, పేస్‌ను ఉపయోగించుకొని టీమ్‌ఇండియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. కేవలం 31 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌, బుమ్రాను ఔట్‌ చేశాడు. అతడు 22 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడిన్లే కావడం గమనార్హం.

విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేసేందుకు న్యూజిలాండ్‌ ఒకే వ్యూహం అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఆ దేశంలో ఆడినప్పుడూ ఔట్‌స్వింగర్లతో విసిగించి అకస్మాత్తుగా ఇన్‌స్వింగర్‌ విసిరి ఔట్‌ చేశారు. ఇప్పుడూ దానినే అనుసరించారా అని ప్రశ్నించగా.. ‘ఓహ్‌.. అవుననే అనుకుంటాను. బహుశా మేం ఈ వ్యూహం గురించే ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేసిన బంతిని కాస్త బ్యాక్‌ ఆఫ్‌ లెంగ్త్‌గా విసిరాను. దానిని నియంత్రించడం ఏ బౌలర్‌కైనా కష్టమే. మెరుగ్గా ఆడటం ఏ బ్యాటర్‌కైనా ఇబ్బందే. అది కేవలం కోహ్లీ కోసమే కాదు’ అని జేమీసన్‌ అన్నాడు.

విరాట్‌  కోహ్లీ కీలక వికెటని జేమీసన్‌ తెలిపాడు. ‘అవును, విరాట్‌ కోహ్లీ టీమ్‌ఇండియాలో అత్యంత కీలకం. అతడిని ఔట్‌ చేయడం సులభం కాదు. ఉదయం త్వరగా అతడిని ఔట్‌ చేయడం మాకు ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత ఆటా మాకు అనుకూలంగానే సాగింది. నిజానికి కోహ్లీ బ్యాటింగ్‌లో సాంకేతిక సమస్యలేమీ కనిపించవు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. వారి ఆటలో లోపాలు ఉండవు. ఏదేమైనా నిలకడగా బంతిని రెండువైపులా స్వింగ్‌ చేయడం సంతృప్తి కలిగించింది. దాంతోనే విరాట్‌ను నియంత్రణలో ఉంచాం’ అని అతడు వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని