
WOMEN IPL: ఇకనైనా మహిళల ఐపీఎల్‌ను నిర్వహిస్తారని భావిస్తున్నా: హీలీ
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు జట్లు కొత్తగా చేరబోతున్నాయి. అహ్మదాబాద్‌ను సీవీసీ క్యాపిటల్స్, లఖ్‌నవూ జట్టును ఆర్పీజీ గ్రూప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12,600 కోట్లు (1.7 బిలియన్డాలర్లు)తో ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల క్రికెట్‌కు ప్రోత్సాహం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆస్ట్రేలియా స్టార్ క్రీడాకారిణి అలీసా హీలీ వ్యక్తం చేసింది. ఐపీఎల్ బిడ్డింగ్‌లో బీసీసీఐకి భారీ మొత్తం సమకూరిందని, ఇందులో మహిళల క్రికెట్‌కు ప్రోత్సాహం ఇస్తారని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలీసా హీలీ వ్యాఖ్యానించింది. త్వరలో మహిళల క్రికెటర్ల పూర్తిస్థాయి ఐపీఎల్‌ను బీసీసీఐ నిర్వహిస్తుందనే ఆకాంక్షించింది. ‘అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పటిష్ఠంగా ఉండాలని కోరుకుంటున్నాం. భారత్‌లోని యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాని కోసం బీసీసీఐ మంచి కార్యక్రమం నిర్వహించాలి’’ అని హీలే పేర్కొంది.
పురుషుల ఐపీఎల్ మాదిరిగానే ప్రతి ఏడాది మూడు జట్లతో మహిళల ‘టీ20 ఛాలెంజ్’ పేరుతో బీసీసీఐ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. అయితే గత ఏప్రిల్‌లో భారత్ వేదికగా జరిగాల్సిన ఐపీఎల్‌ను యూఏఈకి మార్చిన బీసీసీఐ.. మహిళల మ్యాచ్‌ల షెడ్యూల్‌ను నిర్ణయించలేదు. ఈ క్రమంలో హీలీ మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా మహిళల ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు వాయిదా పడటం చాలా నిరుత్సాహానికి గురి చేసింది. టీ20 ప్రపంచకప్ పోటీలకు.. రెండో దశ పురుషుల ఐపీఎల్‌కు మధ్య వ్యవధి కేవలం వారం రోజులే ఉంది. ఈ క్రమంలో మ్యాచ్‌ల నిర్వహణ కోసం బీసీసీఐ చేయాల్సిందంతా చేసింది. అలానే వచ్చే సీజన్‌కు రెండు కొత్త జట్లను తీసుకొస్తుంది. దాదాపు రూ. 12వేల కోట్లకుపైగా సొమ్ము అందుకోనుంది. ఇదే క్రమంలో త్వరలోనే మహిళల ఐపీఎల్‌ను కూడా నిర్వహిస్తుందని భావిస్తున్నా. మహిళల ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను ఎక్కువ చూడాలనే ఆసక్తి వారికీ (బీసీసీఐ) ఉందని అనుకుంటున్నా. ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహణ ఆదర్శంగా ఉంటుంది. మహిళా క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇది సరైన వేదికగా నిలుస్తుంది. వారికి సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తే దానిని ఇష్టపడతా’’ అని తెలిపింది. హీలీ ప్రస్తుతం ఏడో ఎడిషన్ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ (ఎస్ఎస్) తరఫున ఆడుతోంది. ఎస్ఎస్ జట్టులో భారత మహిళా క్రికెటర్లు షఫాలీ వర్మ, రాధా యాదవ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిగ్‌బాష్‌లో టీమిండియా ఉమెన్ క్రికెటర్లు కూడా ఆడుతున్నారు. పూనమ్ యాదవ్ (అడిలైడ్ స్ట్రైకర్స్), స్మృతీ మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్), రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (మెల్బోర్న్ రెనెగేడ్స్) ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం.