Ashwin: అశ్విన్‌ స్థానంలో ఎవరు..? టీమ్‌ఇండియా 10మందితోనే ఆడాలా?

IND vs ENG Third Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి అశ్విన్‌ దూరమవడంతో అతడి స్థానం ఎవరిని తీసుకుంటారన్న చర్చ మొదలైంది. మరి దీనిపై ఐసీసీ రూల్స్‌ ఎలా ఉన్నాయి?

Updated : 17 Feb 2024 12:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్టు క్రికెట్‌ చరిత్రలో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అరుదైన ఘనత సాధించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin).. ఆ ఫీట్‌ అనంతరం కొన్ని గంటలకే జట్టు నుంచి దూరమయ్యాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు (IND vs ENG Third Test) నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి అశ్విన్‌ స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉందా? లేదా టీమ్‌ఇండియా (Team India) 10 మంది ఆటగాళ్లతోనే ఆడాలా?

రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

క్రికెట్‌ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్‌ ఆట మధ్యలో గాయపడినా లేదా అనారోగ్యానికి గురైనా సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ను తీసుకునేందుకు అంపైర్‌ అనుమతినిస్తాడు. ఇవి కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ‘ఆమోదయోగ్యమైన కారణం’తోనూ జట్టు సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అప్పుడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ నుంచి సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్‌ మాత్రమే చేయాలి. బౌలింగ్‌, బ్యాటింగ్‌కు అనుమతి లేదు. అంపైర్ల అనుమతితో వికెట్‌ కీపింగ్‌ చేయొచ్చు.

టీమ్‌ఇండియాకు షాక్‌.. మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్‌

ఇక్కడ అశ్విన్‌ గాయపడలేదు, అనారోగ్యానికి గురికాలేదు. అత్యవసర పరిస్థితుల్లో జట్టును వీడటంతో.. టీమ్‌ఇండియా ఇప్పుడు బెన్‌ స్టోక్స్‌ అనుమతితో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ను పెట్టుకోవచ్చు. ఈ అవకాశంతో ప్రస్తుతానికి రోహిత్‌ సేన దేవదూత్‌ పడిక్కల్‌ను తీసుకుంది. అయితే, అతడు కేవలం ఫీల్డింగ్‌ మాత్రమే చేయాలి. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు మాత్రమే బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశం ఉంటుంది.

కంకషన్‌కు అవకాశం ఉందా?

నిబంధనల ప్రకారం.. ఓ ఆటగాడు ఆన్‌ ఫీల్డ్‌లో గాయపడి మ్యాచ్‌ మొత్తానికి దూరమైతే అప్పుడు అతడి స్థానంలో కొత్త ప్లేయర్‌ను కంకషన్‌గా తీసుకునే అవకాశం ఉంది. కానీ, అశ్విన్‌ అలా వెళ్లలేదు కాబట్టి.. భారత జట్టుకు ఆ అవకాశం లేదు. కానీ, ఇంగ్లాండ్‌ బోర్డుకు భారత్‌ అధికారికంగా అభ్యర్థన చేసుకుంటే, బెన్‌ స్టోక్స్‌ సమ్మతిస్తే.. వాషింగ్టన్‌ సుందర్‌ లేదా అక్షర్‌ పటేల్‌ను భారత్‌ తీసుకునేందుకు ఛాన్సుంది. అశ్విన్‌ దూరమవడంతో ప్రస్తుతం టీమ్‌ఇండియాకు ఫుల్‌టైమ్‌ బౌలర్లు నలుగురే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు