Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు

తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌లో ‘భారత బీ టీమ్‌’ మంగళవారం ఓపెన్‌ సెలెక్షన్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది...

Published : 09 Aug 2022 22:23 IST

(Photo: International Chess Federation Twitter)

మమల్లపురం: తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌లో చివరిరోజు భారత్‌కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. ఓపెన్‌ సెక్షన్‌లో ‘ఇండియా బీ టీమ్‌’ తొలుత కాంస్యం సాధించగా కాసేపటికే.. మహిళల సెక్షన్‌లోనూ ‘ఇండియా ఏ టీమ్‌’ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతోనే మెరిసింది. దీంతో భారత్‌కు ఈరోజు రెండు పతకాలు సొంతమయ్యాయి. ఫైనల్‌ రౌండ్‌లో భాగంగా ఓపెన్‌ సెక్షన్‌లో కొద్దిసేపటి క్రితం జర్మనీతో తలపడిన మ్యాచ్‌లో ‘ఇండియా బీ టీమ్‌’ 3-1 తేడాతో గెలిచింది. మరోవైపు ఇదే విభాగంలో ఉజ్బెకిస్థాన్‌ స్వర్ణం సాధించడం విశేషం. ఆ జట్టు నెదర్లాండ్స్‌తో తలపడిన పోరులో 2-1 తేడాతో గెలిచింది. ఇక స్పెయిన్‌తో తలపడిన మరో మ్యాచ్‌లో ఆర్మేనియన్‌ టీమ్‌ 2.5-1.5 తేడాతో విజయం సాధించి రజతం కైవసం చేసుకుంది. మొత్తంగా ఉజ్బెకిస్థాన్‌ 11 రౌండ్లు పూర్తయ్యేసరికి 19 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

మరోవైపు మహిళల సెక్షన్‌లో టాప్‌ సీడ్‌ అయిన ‘ఇండియా ఏ టీమ్‌’ ఫైనల్‌ రౌండ్‌లో అమెరికాను ఓడించి పసిడి ముద్దాడుతుందని ఆశించగా నిరాశ ఎదురైంది. అమెరికా 3-1 తేడాతో ‘ఇండియా ఏ టీమ్‌’ను ఓడించింది. ఈ జట్టుకు కోనేరు హంపి నాయకత్వం వహించడం గమనార్హం. మరోవైపు మహిళల విభాగంలో ఉక్రెయిన్‌.. జార్జియాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఓపెన్‌ సెలెక్షన్‌ విభాగంలో ‘ఇండియా బీ టీమ్‌’ మొత్తంగా 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని