Hyderabad: భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్లు.. జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత

నగరంలోని జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈనెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల విక్రయాలకు

Updated : 22 Sep 2022 13:10 IST

హైదరాబాద్‌: నగరంలోని జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం అంచనాలకు మించి అభిమానులు వచ్చారు. వేలాదిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. 

ఈనెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల విక్రయాలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం వేకువజాము నుంచే అభిమానులు బారులు తీరారు. టికెట్ల విక్రయం కోసం ప్యారడైజ్‌ కూడలి నుంచి జింఖానా వరకు క్యూలైన్‌ ఏర్పాటు చేశారు.

అంచనాలకు మించి అభిమానులు రావడంతో వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు అవస్థలు పడ్డారు. మెయిన్‌ గేట్‌ వైపు నుంచి ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలో లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంతమందికి అభిమానులతో పాటు 10 మందికిపైగా పోలీసులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో యువతులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

హెచ్‌సీఏ తీరుపై విమర్శలు..

మరోవైపు టికెట్ల విక్రయాలకు జింఖానా మైదానంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటర్ల వద్ద ఆన్‌లైన్‌ పేమెంట్లకు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కార్డులు, యూపీఐ పేమెంట్లను అధికారులు అమనుతించలేదు. కేవలం నగదు చెల్లింపులకు మాత్రమే టికెట్లు విక్రయించారు. టికెట్ల విక్రయం విషయంలో హెచ్‌సీఏ ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని పలువురు అభిమానులు మండిపడ్డారు. హెచ్‌సీఏ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్‌కు సంబంధించిన పాస్‌ల జారీ కూడా గందరగోళంగా మారడంతో హెచ్‌సీఏపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వీఐపీ పాస్‌ల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉండటంతో హెచ్‌సీఏ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఎవరూ చనిపోలేదు: డీసీపీ

తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని నార్త్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీ స్పష్టం చేశారు. ఓ మహిళ మృతిచెందారనే వార్తలను ఆయన ఖండించారు. టికెట్ల కోసం జరిగిన తోపులాటలో మహిళకు గాయాలయ్యాయని.. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. టికెట్ల విక్రయం విషయంలో హెచ్‌సీఏ మేనేజ్‌మెంట్ నిర్వహణ లోపం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని