Wasim Akram: రోజూ ఎనిమిది కిలోల మటన్ తినేలా ఉన్నారు.. పాక్‌ ఆటగాళ్లపై వసీమ్ అక్రమ్ ఆగ్రహం

పసికూన అఫ్గాన్‌ చేతిలో పాకిస్థాన్‌ జట్టు ఓటమిపాలైంది. దీంతో  పాక్‌ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) పాకిస్థాన్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 24 Oct 2023 17:19 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో (నెదర్లాండ్స్‌, శ్రీలంకపై) గెలిచిన పాకిస్థాన్‌ Pakistan) తర్వాతి ఘోరంగా తడబడుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీ ఫైనల్స్‌ రేసులో చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడు ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్‌ చేరడం కష్టమే. ముఖ్యంగా తనకంటే బలహీనమైన జట్టు అయిన అఫ్గాన్‌ (Afghanistan) చేతిలో ఓడిపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులను ఎంతో బాధించింది. పాక్‌ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్‌ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. పసికూన అఫ్గాన్‌ చేతిలో తమ జట్టు ఓటమిపాలుకావడంతో పాక్‌ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) పాకిస్థాన్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఇది ఇబ్బందికరంగా ఉంది. 280-290 పరుగుల లక్ష్యాన్ని రెండే వికెట్లు కోల్పోయి ఛేదించడం సాధారణ విషయం కాదు. పిచ్ తడిగా ఉందా? పొడిగా ఉందా అనే విషయాన్ని పక్కనపెడితే పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్, ఫిట్‌నెస్ స్థాయిలు ఎలా ఉన్నాయో చూడండి. ప్లేయర్స్‌కి రెండేళ్లుగా ఫిట్‌నెస్ టెస్టులు చేయట్లేదని మేం వాదిస్తున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి పేర్లు తీసుకుంటే వారి ముఖాలు వాడిపోతాయి. వీళ్లను చూస్తుంటే ఒక్కొక్కరు రోజూ ఎనిమిది కిలోల మటన్ తింటున్నట్టు కనిపిస్తున్నారు. వీళ్లకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించాలి. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రొఫెషనల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఆడినందుకు డబ్బు తీసుకుంటున్నారు కదా’’ అని వసీమ్ అక్రమ్ ఓ షోలో అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని