Arshdeep Singh: అర్ష్‌దీప్‌ ఎనర్జీ అంతా అక్కడే వృథా అవుతోంది: భారత మాజీలు

న్యూజిలాండ్‌తో (IND vs NZ) భారత్‌ (Team India) మూడు టీ20ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh) భారీగా పరుగులు సమర్పించడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.

Updated : 28 Jan 2023 12:39 IST

ఇంటర్నెట్ డెస్క్: గత సంవత్సరం తన సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్.. కొత్త ఏడాదిలో మాత్రం తడబాటుకు గురికావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో నో బాల్స్ వేసి ఒక్కసారిగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్‌ భారీగా పరుగులు సమర్పించాడు. నాలుగు ఓవర్లలో ఒక వికెట్‌ తీసి 51 పరుగులు ఇచ్చాడు. అందులోనూ ఒక నోబాల్‌ ఉండటం గమనార్హం. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లోని లోపాలను భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్ సంజయ్ బంగర్, మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఓ క్రీడా ఛానల్‌లో చర్చ సందర్భంగా ప్రస్తావించారు.

‘‘అర్ష్‌దీప్‌ ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపలేదు. అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టి తనకంటూ గుర్తింపు సాధించిన అతడు ఇటీవల ఇబ్బందికి గురవుతున్నాడు. లెంగ్త్‌లో బంతులను సంధించలేకపోతున్నాడు. అందుకే అతడు తన బౌలింగ్‌లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలివిగా బౌలింగ్‌ చేయాలి. అయితే ఇదొక ప్రయాణం.. తప్పకుండా మెరుగవుతాడు. మంచి ఆరంభం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి. అయితే.. నైపుణ్యాలకు దీనిని పరీక్షగా భావించాలి’’ అని బంగర్ తెలిపాడు. 

‘‘రన్నప్‌ను ఎక్కువగా తీసుకొనే అర్ష్‌దీప్‌ వంటి బౌలర్లకు అడుగులు వేసేటప్పుడు సమస్యలు వస్తుంటాయి. అర్ష్‌దీప్ దూరం నుంచి పరిగెత్తుతూ తన శక్తిని వృథా చేసుకొంటున్నాడు. అతడి లాంగ్‌ రనప్‌ వల్లే క్రీజ్‌ను దాటి అడుగు ముందుకు పడిపోతోంది. అందుకే ప్రాథమిక అంశాలపై దృష్టిపెట్టాలి.  అతడు చాలా మంచి బౌలర్‌’’ అని కైఫ్ తెలిపాడు. బంగర్‌ కూడా కైఫ్ వ్యాఖ్యలను అంగీకరించాడు. రనప్‌ విషయంలో జాగ్రత్తలు వహిస్తే బాగుంటుందని సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని