S Sreesanth : తొమ్మిదేళ్ల తర్వాత శ్రీశాంత్‌కు తొలి ఫస్ట్‌క్లాస్‌ వికెట్

టీమ్‌ఇండియా మాజీ పేస్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ....

Published : 04 Mar 2022 01:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ శ్రీశాంత్‌కు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలి వికెట్‌ దక్కింది. 2013లో ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌తో శ్రీశాంత్‌ జీవితకాలం నిషేధానికి గురైన విషయం తెలిసిందే. వివిధ విభాగాల్లో అప్పీలు చేసుకోగా శిక్ష ఏడేళ్లకు తగ్గింది. ఎట్టకేలకు 2020 సెప్టెంబర్‌ నాటికి శ్రీశాంత్‌ నిషేధం పూర్తి చేసుకున్నాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. గత నెలలో జరిగిన ఐపీఎల్‌  మెగా వేలంలోనూ రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నా ఫలితం దక్కలేదు. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే  కేరళ తరఫున రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం మాత్రం వచ్చింది. 

మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 11.5 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లను శ్రీశాంత్‌ తీశాడు. తొలుత మేఘాలయ బ్యాటర్‌ ఆర్యన్‌ బోరా వికెట్‌ పడగొట్టిన ఆనందంలో పిచ్‌కు విభిన్నంగా అభివాదం చేశాడు. దానికి సంబంధించిన వీడియోను తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘‘దేవుడి దయతో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నాకు తొలి వికెట్ దక్కింది. అందుకే పిచ్‌ మీద సాష్టాంగ ప్రణామం చేశా’’ అని శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేరళ 505/9 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం మేఘాలయ మొదటి ఇన్నింగ్స్‌లో 148/10, రెండో ఇన్నింగ్స్‌లో191/10 కుప్పకూలింది. దీంతో కేరళ 166 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లోనూ శ్రీశాంత్ 19 పరుగులు చేశాడు. అయితే ఆర్యన్‌ బోరా బౌలింగ్‌లోనే శ్రీశాంత్ ఔట్‌ కావడం గమనార్హం. 

టీమ్‌ఇండియా తరఫున శ్రీశాంత్ 2011లో ఆఖరిగా అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఆ ఏడాది ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భాగంగా ఆగస్టు 18 నుంచి 22 వరకు నాలుగో టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 591 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. బౌలర్లలో శ్రీశాంత్‌ (3/123) ఒక్కడే మూడు వికెట్లను పడగొట్టి ఫర్వాలేదనిపించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరిసారిగా ఇయాన్‌ మోర్గాన్‌ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులే చేయగలిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని