Dinesh Karthik: టీమ్‌ఇండియాలో అతడే కీలక ప్లేయర్‌.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్‌

ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కీలకంగా మారే ఆటగాడి పేరుని దినేశ్ కార్తిక్‌ వెల్లడించాడు.

Published : 27 Mar 2023 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ముగిసిన వెంటనే తమ ఇళ్లకు చేరుకున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. ఐపీఎల్‌-16 సీజన్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఆర్సీబీ శిబిరంలో చేరిపోయాడు. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌.. దాదాపు రెండు నెలలపాటు జరగనుంది. ఈ ఏడాదే ప్రపంచకప్‌ కూడా జరగనుండటంతో కీలక ఆటగాళ్ల పనిభార నిర్వహణపై టీమ్‌ఇండియా దృష్టిపెట్టింది. ఈ విషయంలో ఫ్రాంచైజీలకు సూచనలు చేసినట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. ప్రధాన ఆటగాళ్లను కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంచేలా బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కీలకంగా మారే ఆటగాడి పేరుని దినేశ్ కార్తిక్‌ వెల్లడించాడు. అయితే.. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలలో ఒక్కరి పేరును కూడా డీకే చెప్పలేదు. ఇంతకీ దినేశ్ కార్తిక్‌ చెప్పిన ఆటగాడు ఎవరో తెలుసా.. ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య.

‘టీమ్‌ఇండియా లైనప్‌లో హార్దిక్‌ పాండ్య నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన ఆటగాడు. ఎందుకంటే అతడు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించగలడు. మీడియం పేసర్‌గా ఉంటూ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఉండటం చాలా కష్టం.  జట్టులో ఇద్దరు, ముగ్గురు స్పిన్‌ ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ   ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌లను పొందడం చాలా కష్టం. హార్దిక్‌ మిడిల్‌ ఆర్డర్‌లో బాగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్ విషయానికొస్తే వికెట్లు రాబట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నట్లు కనిపిస్తోంది. అతడు బౌలింగ్ చేసే విధానం గమనిస్తే ఎప్పుడూ షార్ట్ బంతుల కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేయడం ఎప్పుడైతే ప్రారంభించాడో బ్యాటర్ తన భారమంతా బ్యాక్ ఫుట్‌పై పెట్టి షార్ట్ బంతుల కోసం చూస్తుంటాడు. ఆ సమయంలో నిదానంగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. హార్దిక్ పాండ్య టీమ్‌ఇండియాకు కీలకం. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడనే దానిపై జట్టు నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ఫామ్‌లో ఉంటే హార్దిక్‌ టీమ్‌ఇండియాకు కీలక ఆటగాడు’ అని డీకే వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని