Sourav Ganguly: గంగూలీ గొప్ప సారథి: సచిన్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ గొప్ప సారథి అని దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. సంధి దశలో ఉన్న భారత క్రికెట్‌ను ఉన్నత స్థితికి తీసుకెళ్లిన ఘనత గంగూలీదేనని తెలిపాడు. గంగూలీని ఆటగాడిగా

Updated : 08 Jul 2022 09:19 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ గొప్ప సారథి అని దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. సంధి దశలో ఉన్న భారత క్రికెట్‌ను ఉన్నత స్థితికి తీసుకెళ్లిన ఘనత గంగూలీదేనని తెలిపాడు. గంగూలీని ఆటగాడిగా, కెప్టెన్‌గా, పరిపాలకుడిగా చూస్తున్న సచిన్‌కు అతనితో మూడున్నర దశాబ్దాల సాన్నిహిత్యం ఉంది. శుక్రవారం 50వ పుట్టిన రోజు జరుపుకోనున్న గంగూలీ గురించి సచిన్‌ మాట్లాడుతూ.. ‘‘గంగూలీ గొప్ప సారథి. జట్టును సమన్వయం చేయడమెలాగో అతనికి బాగా తెలుసు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు బాధ్యతలు పంచేవాడు. గంగూలీ నాయకత్వం చేపట్టినప్పుడు భారత క్రికెట్‌ సంధి దశలో ఉంది. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి యువ ఆటగాళ్ల బృందం అవసరం. ఆ సమయంలో సెహ్వాగ్‌, యువరాజ్‌, జహీర్‌, హర్భజన్‌, నెహ్రా వంటి ఆటగాళ్లను గుర్తించాం. వాళ్లంతా మేటి ఆటగాళ్లు. అయినా కెరీర్‌ ఆరంభంలో వారికి మద్దతు అవసరం. గంగూలీ అదే పని చేశాడు. 1999 ఆస్ట్రేలియా పర్యటనలో నేను సారథిగా ఉన్నప్పుడు గంగూలీని వైస్‌ కెప్టెన్‌గా నియమించమని సూచించా. అతడిని ఎంతో దగ్గరగా చూశా. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లగలడని నాకు తెలుసు. అతనో మంచి కెప్టెన్‌. అందుకే గంగూలీ పేరు సిఫార్సు చేశా. ఆ తర్వాత గంగూలీ వెనుదిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్‌కు అతను ఏం చేశాడో మనందరికీ తెలుసు. 1991లో తొలిసారి అతడు భారత జట్టుకు ఎంపికైనప్పుడు మేమిద్దరం ఒకే గదిలో ఉన్నాం. అండర్‌-15 రోజుల నుంచే మాకు పరిచయం ఉంది. 1991 తర్వాత కొంతకాలం అతడు జట్టులో చోటు కోల్పోయినా మా స్నేహం మాత్రం కొనసాగింది’’ అని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని