Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్‌: గౌతమ్‌ గంభీర్‌

ఐసీసీ (ICC) ర్యాంకుల్లో ముందంజలో ఉన్నామని సంబరపడిపోతున్న భారత ఆటగాళ్లకు గౌతమ్‌ గంభీర్‌ కీలక సూచనలు చేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) నెగ్గాలంటే ర్యాంకులు ముఖ్యం కాదని వ్యాఖ్యానించాడు.

Updated : 23 Sep 2023 17:36 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ (ICC) ర్యాంకుల్లో భారత్ ఆటగాళ్లతో పాటు జట్టు కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) ముంగిట ఇలా ర్యాంకుల్లో ముందంజలో ఉంటే  టీమ్‌ఇండియా ఆటగాళ్లలో తప్పకుండా ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే, భారత మాజీ స్టార్‌ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ (Gautham Gambhir) మాత్రం ఇలాంటి ర్యాంకులు మెగా టోర్నీలో అవసరం లేదని.. బలమైన జట్లను ఓడిస్తేనే విజేతగా నిలిచే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి జట్టును ఓడించాలని సూచించాడు. గతంలో భారత్‌ ప్రపంచకప్‌లను గెలిచిన సందర్భాలనూ గంభీర్ ఉదహరించాడు.

‘‘వరల్డ్‌ కప్‌ను నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగితే మాత్రం ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడించాల్సిందే. ఆ జట్టు మెగా టోర్నీల్లో అత్యంత బలమైంది. మేం 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఆసీస్‌ను సెమీస్‌లో ఓడించాం. అప్పుడు విజేతగా నిలిచాం. ఆ తర్వాత 2011లోనూ క్వార్టర్‌ ఫైనల్‌లో ఆసీస్‌ను మట్టికరిపించాం. రెండోసారి వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా అవతరించాం. ఐసీసీ టోర్నీల్లో ఏదొక దశలో ఆసీస్‌ను భారత్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఆసీస్‌పై గెలిస్తే దాదాపు కప్‌ను సొంతం చేసుకున్నట్లే. అందుకే, వరల్డ్‌ కప్‌లో ర్యాంకింగ్‌కు సంబంధమే లేదు. 

మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

ప్రస్తుతం భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. మెగా టోర్నీల్లో ఆ జట్టుతో గట్టి పోటీ ఉంటుంది. ఆటగాళ్లు కూడా అంతే పట్టుదలతో ఆడతారు. టీమ్‌ఇండియా గత రెండు వరల్డ్‌ కప్‌ (టీ20, వన్డే) టోర్నీల్లో విజేతగా నిలిచిందంటే దానికి కారణం ఆసీస్‌ను నాకౌట్‌ దశలో ఓడించడమే. అలాగే 2015 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఒకవేళ అక్కడా గెలిచి ఉంటే ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువ. ఈసారి వరల్డ్‌ కప్‌లో తొలి మ్యాచ్‌ ఆసీస్‌తోనే జరగనుంది. ఇందులో గెలిస్తే తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే, మనకు తొలి మ్యాచ్ చాలా కీలకం’’ అని గంభీర్‌ తెలిపాడు. ప్రస్తుతం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని